padyam-hrudyam

kavitvam

Tuesday, May 26, 2020

రాధా కృష్ణుల సరసాలు

పూర్ణేందు బింబమ్ము పొలతి! సిగ్గిలి దాగె
....నీ ముఖ బింబపు నిగ్గు జూచి
శరదిందు చంద్రికల్ కురిపించు నీవుండ
....చంద్రబింబ మదేల సన్నుతాంగ!

నల్లని మబ్బులు చల్లగా జారెను
....నీలాలకల గాంచి నీల వేణి !
నీలమేఘశ్యామ! నీమేని సొగసుకు
....కలవరపడి పోయె జలద పంక్తి

సిగ్గిలి మల్లెలు సిగలోన దూరె నీ
....మందహాసమునకు కుందరదన!
నీలికల్వల తోడి నెయ్యము జేయగా
....వెనుక జేరిన వవి వేణులోల!

కువలయ దళములు కుంచించుకొని పోయె
....నేత్రాల సొంపుకు నీరజాక్షి!
నీరజదళముల నిగ్గుకు వెరగొంది
....కలువలు వాడెను కమలనయన!


విమల బృందావనీ సీమ యమున తటిని
రాధికను జేరి మురిపించె మాధవుండు
మాధవుని ప్రేమ పొంగుల మఱచి జగము
లీనమాయె వెన్నుని లోన తాను రాధ.

No comments: