padyam-hrudyam

kavitvam

Tuesday, April 28, 2020

మాతృ పంచకం

నాదు ముత్యమా రత్నమా నాదు కంటి
వెలుగ నూరేళ్ళురా కన్న యెలమి నిట్లు
నన్ను బిలచిన నీ నోట నిన్ని వట్టి
బియ్య ముంచితి మన్నింపు బిడ్డ నమ్మ.

పంటి బిగువున నను గను ప్రసవ మందు
తాళగా లేని బాధను దట్టుకొనగ
నమ్మ శివ హర గోవింద యయ్య  కృష్ణ
యనుచు సైచిన నీకు వందనము లమ్మ.

కటకట నన్ను నీవు కను కాలము నందున శూల బాధ నీ
వెటుల సహించితో! తనువు నెండును, నాదు  మలాన శయ్యయున్
పటు మలినమ్ము కాగ నొక వత్సర కాలమ దెట్లు సైచితో
యటమట!  తాళ నన్యులకు నౌనె? ఘనుండగు గాక పుత్రుడే
యెటుల ఋణమ్ము దీరు జనయిత్రిది? దండము నీకు నమ్మరో. 

స్వప్నమున నన్ను సన్యాసి వలెను జూచి
యేడ్చితివి గురుకులమున కేగు దెంచి
యందరును నిను గని బాధ నొంది నార
లట్టి మహనీయ పాదాల కంజ లింతు.

నీ యవసాన మౌ పిదప నే నిట వచ్చితి నమ్మ! గొంతులో
బోయగ నైతి తోయమును, బూనిక శ్రాద్ధవిధిన్ 'స్వధా'ను నే
జేయగ నైతి, తారకము జెప్పగ నైతిని నీ చెవి న్నతుల్
నా యపరాధముల్ సయిచి న న్నతుల ప్రియ మార జూడవే.

No comments: