padyam-hrudyam

kavitvam

Thursday, April 2, 2020



ఉ. దండము సీతయేలికకు, తాపసి జన్నపు మేటి కాపుకున్
దండము నేలపట్టి యెదతామర తేనియ లాను తేటికిన్
దండము కోతిమూక నొక త్రాటిని నిల్పిన చేతకానికిన్
దండము నీటికుప్ప పయి దందడి యట్టెడ కట్టి నయ్యకున్.
ఉ. దండము దుమ్ములో బొగులు తాపసి యాలిని కాలి దువ్వతో
దుండిగ జేసి సాపెనను దోలిన జేజికి, కాటి ఱేనిదౌ
దండి లసక్తిని న్విరిచి తన్విని గైకొని నట్టి మేటికిన్
తండిరి మాటకై గరిక దత్తు సుకమ్ముల వీడి నయ్యకున్.
ఉత్పలమాలిక:
కోతుల చెల్మి చేసి యొక కోతిని జంపి మరొక్క కోతికిన్
కోతుల రాజ్య మిచ్చి యొక కోతిని దూతగ పంపి లంక కా
కోతుల సాయముం గొని యకుంఠిత దీక్షను దైత్యు గెల్వవే?
భూతల మందు మా నరుల పుట్టిని ముంచు కరోన నామయై
భీతిని గొల్పు సూక్ష్మ మగు పెద్ద కృమిన్ గనవేమి? విస్మయం
బీ తరి నీవు మౌనమున నేమియు బట్టని వాని వోలె నీ
సీతను గూడి భద్రగిరి జేరి సుఖమ్ముల దేలుచుంట! నా
త్రేతను రావణుం డిలను దిప్పలు పెట్టిన క్రూరమైన యా
రీతి కరోన నే డిలను లేకను సుంతయు జాలి మమ్ములన్
బ్రీతిగ నంజుకున్ దినుచు లేక నిరోధము రెచ్చుచుండగా,
మూతికి గుడ్డ కట్టుకొని ముక్కును మూసుక బూని మౌనమున్
జూతువె చోద్యమున్? భయమె సోకుని కన్న కరోన జూచినన్?
వాతలు తేలవే క్రిమికి బామముతో కడకంట నారయన్
యాతుల వైరి నీవు? పరిహాసము చాలును, తాళ లేము, సం
ప్రీతిని నీదు బిడ్డలను వేగమె సాకవె యార్త రక్షకా!
జోతలు జోతలో దనుజసూదన! శ్రీ రఘురామ! కావవే.

No comments: