padyam-hrudyam

kavitvam

Friday, June 8, 2018

తొలకరిలో ఒక రైతు మనోభావం



చిటపట చినుకులు రాలెను
చటచట మను సూర్యు డింక చల్లగ మారున్
కటకట దీరును తనకని
అటమట పడు రైతు మదికి నానంద మయెన్.

తొలకరించెను నేడు పులకరించెను నేల
.....యేరువాక శుభమ్ము లిచ్చు నింక
కామందు నామాట కాదనబోడులే
.....కాడెడ్లతో పని కాని దికను
రామన్న కడ కేగి ట్రాక్టరు మాటాడి
.....దమ్మును జేయించ దక్కు ఫలము
విత్తులు మంచివి వెదకి పట్టిన చాలు
.....నారుమడిని బోసి నీరు పెడుదు

మెరక తోటకు గట్టితి నరక చాలు
దుక్కి దున్నితి పదనున జిక్కు తీరె
కూలివాండ్రకే నిజమైన కొరత నేడు
వేయ గట్లంక లాయెను పెద్ద బరువు.

నీరు లభించెడిన్, మురుగు నీటికి బోదెలు సిద్ధమాయె, వ్యా
పారియు నప్పు నిచ్చు, నిక వంచిన కాయము మేలు నాకు, స
ర్కా రిడ విత్తు లెర్వులను కాలము నందున, జాలు, సేమమౌ
కోరిన దాలి తాడు, కొని కోరిక దీర్తును పాప మామెకున్.

పదనున జల్లినాడ కద పైరుల, రాబడి చాలు కొంతలో
నదనున నూడ్చి యెర్వులను నాపయి చీడల మందు లిచ్చినన్
ముదమున నేలతల్లి యెద పొంగి సమృద్ధిగ నిచ్చు బంటలన్
సదయ కదా సతమ్ము తను సాకును రైతును కంటి రెప్పయై.

సైతుము కష్టనష్టముల స్థైర్యముతో శ్రమియించి, యేలికల్  
రైతుకు దన్నుగా నిలువ లక్ష్యము జేరుట కా దసాధ్యముల్,
ప్రీతిని గిట్టుబాటు ధర బెంచిన ఖర్చుకు తగ్గ యోగ్యమౌ 
రీతిని వచ్చు రాబడులు, లేములు బాయును చింత లారెడిన్. 





No comments: