padyam-hrudyam

kavitvam

Thursday, June 7, 2018

జయ జగదీశ హరే

జయదేవుని గీత గోవిందం లో  వచ్చు పద్యం. ఈ పద్యంలో కవి దశావతార వర్ణన లో శ్రీ కృష్ణుని ఎందుకు వర్ణించలేదు అనే సందేహానికి జవాబు చెప్పుతూ  శ్రీ కృష్ణుడే పది రకాల విభిన్న అవతారములను ధరించెను అని ప్రతిపాదించుచున్నాడు.

శార్దూల విక్రీడిత వృత్తం

వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్బిభ్రతే, దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే |
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే,
మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయ తుభ్యం నమః || 5 ||

ప్రతి పదార్థం.
వేదాన్ = వేదములను
ఉద్ధరతే = ( సముద్రంలో మునిగి పోయిన వాటిని ) పైకి లేపుచున్న ( నీకు )
జగత్ = ప్రపంచమును
ని వహతే = చాలా చక్కగా మోయుచున్న ( నీకు )
భూగోళమ్ = గోళాకారము లో ఉన్న భూమిని
 ఉత్ బిభ్రతే = పైకి ఎత్తి పట్టి మోయుచున్న ( నీకు )
దైత్యం = ( హిరణ్య కశిపుడు అను ) రాక్షసుని
దారయతే = చీల్చి వేయుచున్న ( నీకు )
బలిం = బలి చక్రవర్తి ని
ఛలయతే = మోసగించుచున్న ( నీకు )
క్షత్ర క్షయం = క్షత్రియులైన రాజుల యొక్క నాశనమును
కుర్వతే = చేయుచున్న ( నీకు )
పౌలస్త్యం = పులస్త్య బ్రహ్మ కుమారుడైన పది తలల రావణుని
జయతే = జయించుచున్న ( నీకు )
హలం = నాగేలును
కలయతే = ధరించుచున్న ( నీకు )
కారుణ్యమ్ = దయను
ఆతన్వతే = అంతటా వ్యాపింప జేయుచున్న ( నీకు )
మ్లేచ్ఛాన్ = దుష్టులు దురాచారులు దుర్మతీయులు అగు విదేశీయులను
మూర్ఛయతే = మూర్ఛ వోవునట్లు చేయుచున్న ( నీకు )
దశ+ఆకృతి కృతే = పది రకాల విభిన్న ఆకారములను తయారు చేసి ధరించుచున్న (నీకు )
కృష్ణాయ = సమస్తమును నీ వైపు ఆకర్షించుకొను స్వభావము కలవాడవు అగుటచే కృష్ణుడు అని పిలువబడే
తుభ్యం = నీకు
నమః = ( నా ) నమస్కారమును
( కరోమి ) = చేయుచున్నాను.

భావము.
పూర్వం సోమకుడు అను రాక్షసుడు బ్రహ్మ నుండి వేదములను అపహరించి సముద్రంలో దాగి యుండగా నీవు చేప యొక్క రూపమును ధరించి వానిని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మ దేవుని కి ఇచ్చి రక్షించితివి. గోళాకారము లో ఉన్న భూమి క్రిందికి పడి పోకుండా తాబేలు రూపంలో దానిని మోయుచున్నావు.  పూర్వం హిరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని అపహరించి సముద్రంలో మునిగి దాగి ఉండగా నీవు పంది రూపము ధరించి వానిని సంహరించి భూమిని నీ కోరలతో పైకి ఎత్తి యథాస్థానము లో నిలిపితివి. హిరణ్యకశిపుడు తన కుమారుడు అగు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అయినాడని వానిని చంపుటకు ప్రయత్నించుచుండగా విష్ణువు అంతటా ఉన్నాడు అని చెప్పిన ప్రహ్లాదుని మాటను నిజం చేయుటకు స్తంభం నుండి నరసింహ స్వామి వారి రూపమును ధరించి హిరణ్యకశిపుని సంహరించితివి. వామన రూపంలో బలి చక్రవర్తి నుండి మూడు అడుగులను దానము గా తీసుకుని ముల్లోకాలను ఆక్రమించి స్వర్గమును దేవతలకు రాజు అయిన ఇంద్రునికి తిరిగి ఇచ్చితివి.  జమదగ్ని మహర్షి కి పరశురాముడు గా పుట్టి దుష్టులు అయిన రాజులను అందరినీ నిశ్శేషముగా ఇరువది ఒక్క సారులు సంహరించితివి. దశరథ మహారాజుకి శ్రీ రాముడు గా జన్మించి పులస్త్య బ్రహ్మ కుమారుడైన పది తలల రావణుని వధించితివి. వాసుదేవ కృష్ణుని అన్న అయిన బలరాముడు గా జన్మించి నాగేలునే ఆయుధముగా చేపట్టితివి. మాయాదేవి శుద్ధోదనులకు సిద్ధార్థ గౌతముడు గా జన్మించి బుద్ధుడవై అహింసయే పరమ ధర్మమని బోధించితివి. కలి యుగం చివరలో కల్కి అవతారం ఎత్తి దుష్టులను సంహరించి ధర్మమును మరల స్థాపించెదవు. ఈ విధంగా పది రకాల విభిన్న అవతారములను ధరించెడు నీకు నేను నమస్కారములు చేయుచున్నాను.

....

వేదము లుద్ధరించి గిరి వీపున దాల్చి ధరన్ భరించి ప్ర
హ్లాదుని గాచి వామనుడవై బలి నొంచి నృపాళి ద్రుంచి లం
కాధిపతిన్ వధించి హలి నాని మహా కరుణా సముద్రమై   
మేదిని మ్లేచ్ఛులన్ దునిమి మించు దశాకృతు గృష్ణు గొల్చెదన్. 
   

No comments: