వేకువ జామునన్ జనులు వీడకె నిద్దుర నేస్తకాళ్ళతో
పోకిరులౌచు జట్లుగను పోయి గభాలున దొడ్ల గోడలన్
దూకుచు కర్రకంపలను దుంగల దొంగిలి తెచ్చి పేర్చి మా
మూకలు భోగిమంటలను మోదముతో రగిలించుటెంచెదన్.
రంగుల రంగవల్లులను రాజిలు గొబ్బెల పట్టుపావడాల్
హంగుగ దాల్చి కన్నియలు నందముగా నడయాడు శోభలన్
రంగహరీ యటంచు ఘన రాగములన్ చరియించు దాసులన్
ముంగిట గంగిరెడ్లు బుడబుక్కలు సందడి మించు లెంచెదన్.
బలమగు శూలమున్ వెదురు బద్దలు కంకర మొగ్గ దండియల్
లలితమనోజ్ఞ వర్ణమయ రాజిత కాంతుల నొప్పునట్లుగా
పలువురు గూడి మోదమున భవ్య ప్రభల్ రచియించి మించగా
నలరు ప్రభాఖ్య తీర్థముల నశ్శరభా సునినాద మెన్నెదన్.
బాల్యము మాసిపోయినను భావమునన్ కదలాడి గుండియన్
లౌల్యము రేపుచుండినది రమ్మని చెంతకు నాటి క్రీడకున్
శల్యము లౌచు చిక్కి మన సంస్కృతులున్ కళ దప్పె జాతి కై
వల్యము సాంప్రదాయ ప్రతిపాలనలో హవళించు నెంచగన్.
No comments:
Post a Comment