padyam-hrudyam

kavitvam

Wednesday, May 11, 2016

నేడు శ్రీ శంకరుల జయంతి.



సాంగవేదమ్ములు సద్గురు కృప చేత
.........చదువ బడును గాక సంతతమ్ము
చదువబడిన వేద విదిత కర్మమ్ములు
.........విడువక పాటింప బడును గాక
పాటింప బడు కర్మ  పరమాత్మ పూజను
.........నిష్కామమైనదై నిలుపుగాక
నిష్కామ కర్మచే నిర్మలమై బుద్ధి
.........వాంఛలు  విడనాడ బడును గాక

పాపరాశి దులపబడి పారు  గాక
భవసుఖమ్ము లనిత్య మన్ భావ మగుత
ఆత్మ తత్త్వమ్ము నన్ వాంఛ యగును గాక
స్వగృహమును వీడి వడి వెళ్ళ బడును గాక.

సజ్జనముల మైత్రి సమకూడ బడు గాక
.........దేవుని యెడ భక్తి  దృఢము గాత
శాంత్యాది యుత్తమ సంస్కార గుణములే
.........అభ్యసింప బడుచు నలరు గాక
నిత్య  నైమిత్తిక నిహితమై యుండియు
.........కర్మ సన్న్యాసమ్ము కలుగు గాక
యోగ్యుడౌ విద్వాంసు డొడ గూడ బడు గాక
.........గురుపాదయుగసేవ కూడు గాక

స్వపర భేద రహితమును, సర్వమునను
నొక్కడై యుండియును  నిండి చ్యుతి నెరుగని
బ్రహ్మ మర్థింప బడు గాక ప్రాతచదువు
పదము బాగుగా చర్చింప బడును గాక.

(జగద్గురువుల ఉపదేశ పంచకము నుండి)

No comments: