padyam-hrudyam

kavitvam

Friday, August 12, 2016

శ్రీ కృష్ణాయ నమః

సహ్యాద్రిపై పుట్టి చక్కని చిక్కని
........వంపుల సొంపారు వన్నెలాడి
కృష్ణయై వేణియై కేల్బట్టి నడయాడి
.........యేకరూపమ్మైన యించుబోడి
బిరబిర పరుగిడి బీడుభూముల జుట్టి
.........పచ్చ రంగద్దిన బాగులాడి
హంసలదీవిలో నానంద ముప్పొంగ
.........పతి కౌగిటను జేరు వలపుబోడి
శ్రీల పుట్టిల్లు తెలుగింటి జీవనాడి
సిరుల పండించు తీయని క్షీరధార
గంగ పాపాల బాపిన ఘన యశస్వి
చేరి మునుగరో మ్రొక్కరో చేతు లెత్తి.
సంగమేశ్వరదేవు సన్నిధి ముంచెత్తి
.......చరచరా ముందుకు సాగిపోయె
శ్రీశైల మల్లన్న చిందించ నవ్వులు
.......పాతాళగంగయై పరుగు బెట్టె
నమరావతిని నాటి యైశ్వర్యముల గని
.......యానందలహరియై యాట లాడె
నింద్రకీలాద్రిపై నిరవైన దుర్గమ్మ
.......పాదాల ముద్దాడి పరవశించె
పంచ పాతక హారిణి భవ్య రమణి
రాజిత తరంగవాణి వరాల పాణి
విష్ణుమూర్తి స్వరూప మీ కృష్ణవేణి
చేరి మునుగరో మ్రొక్కరో చేతు లెత్తి.
పుష్కరు డేగు దెంచె కడు మోదము తోడుత కృష్ణవేణికిన్
పుష్కలమైన పుణ్యముల ప్రోవయి దేవగురుండు కన్య నా
విష్కరుడైన వేళ జని వేడుకతో నుతియించి మున్గినన్
శుష్కములౌను పాపములు శుద్ధత నొందును జన్మ లిద్ధరన్.

No comments: