padyam-hrudyam

kavitvam

Monday, September 5, 2011

గురుర్బ్రహ్మా.......


మనసా వాచా కర్మణా విద్యా బోధనకే జీవితము
నంకితము జేసిన ఉపాధ్యాయులకు నమోవాకములు.


గురువన నాదిజుడౌ ధర
గురువే హరి గురువు శివుడు గురువే సాక్షా-
త్పర తత్త్వమైన బ్రహ్మము
గురువుకు వందనము లిడుదు గురుతర భక్తిన్.

అజ్ఞానపు చీకట్లను
సుజ్ఞానపు ప్రభల జీల్చి శూన్యము చేయున్
విజ్ఞానము బోధించును
ప్రజ్ఞా మూర్తులుగ గురువు ప్రజలను దిద్దున్.

విద్యా బుద్ధుల గఱపుచు
హృద్యంబగు నీతి పథము నింపుగ జూపు-
న్నాద్యుండగు దైవంబై
సద్యశమును కల్గజేయు సద్గురువెపుడున్


No comments: