padyam-hrudyam

kavitvam

Sunday, April 3, 2011

వసంతానికి స్వాగతం





















నిశలు కృశించ సాగినవి, నింబము పూయ నుపక్రమించె, న-
ల్దిశలు వెలార్చె శోభలను దివ్య మధూదయ వేళకై యహ-
ర్నిశలు తపించు మావికిని, నేస్తము కోయిలకున్ శుభంబగున్
శిశిరమ! పోయి రమ్మికను శీఘ్రమె! పంచు నుగాది వేడుకల్.

వచ్చెను వసంత మదిగో!
తెచ్చెను సంతోష ఝరులు దివ్య ధరిత్రిన్!
విచ్చెను ఆశల పువ్వులు!
చెచ్చెర నెమ్మనములందు జీవులకెల్లన్!

గున్న మామిడి కొమ్మ గుబురు లోపల దాగి
.................................పంచమ స్వరములో పాడె పికము!
రంగు రంగుల పూలు హంగుగా ధరియించి
.................................చిరుగాలి నూగెను చెట్టు చేమ!
మలయ మారుత వీచి నల్దిశల్ పయనించి
.................................సుమ సౌరభమ్ముల సుఖము నింపె!
మధువులానగ తేటి మత్తిల్లి తమకాన
.................................లాస్యమ్ము చిందించె లలిత విరులు!

క్రొత్త ఆశలు కోర్కెలు గుండె నింప
మోసికొని వచ్చితీవు ఓ ముద్దుగుమ్మ!
సకల జనముల బ్రతుకుల చక్క దిద్ద
స్వాగతమ్మిదె నీకు వాసంత లక్ష్మి!



2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఆహ్లాదకరంగా,శుభకరంగా బాగుందండి.

మిస్సన్న said...

మందాకినిగారూ బ్లాగుకు స్వాగతం..
వాసంత స్వాగతం నచ్చినందుకు ధన్యవాదాలు.