padyam-hrudyam

kavitvam

Sunday, January 2, 2011

శారదా స్తుతి


శ్రీ శారదాంబాయై నమః
*****************


భువనేశ్వరి నీ తత్త్వము
నెవ రెరుగుదు రిద్ధరిత్రి నిసుమంతేనిన్
పవలున్ రేయియు ప్రాణుల
జవ సత్త్వము లీవు గాదె సత్యము వాణీ!
****************************************
రసనను నీ వుండిన దు-
ర్వ్యసనమ్ములు తొలగి పోవు వ్యక్తుల కెల్లన్
అసలీ సృష్టిని మనుగడ
పొసగునె నీ కరుణ లేక పొందుగ వాణీ!
****************************************
కవులెందరొ నీ కరుణను
చవులూరగ నింపినారు షడ్రుచులొప్పన్
ప్రవిమల కావ్యము లెన్నియొ
సువిశాల ధరిత్రి నెల్ల జూడగ వాణీ!
****************************************
విద్యల నిమ్మా దయతో
పద్యంబుల జెప్పగల్గు పటుతర శక్తిన్
సద్యః స్ఫూర్తిని యిమ్మా
హృద్యంబయి బుధులు మెచ్చ నిమ్ముగ వాణీ!
*****************************************
శారద! నీ కటాక్షమున చక్కగ రాతికి పల్కు లబ్బెడిన్!
ధారగ కైత లయ్యెడిని ధారణ కోర్వని పామరాళికిన్!
నేరుగ పద్య గద్యముల నేర్పు లభించెడి నీ వసుంధరన్!
యారక నా కలంపు తడి యమ్మరొ! దీవెన లిమ్ము మ్రొక్కెదన్.
*****************************************
*****************************************

1 comment:

మిస్సన్న said...

హమ్మయ్య !ఇన్నాళ్ళకి నా బ్లాగును సందర్సించిన వారొకరు దొరికారు!ధన్యవాదాలు రాజేశ్వరి గారూ!