

కీర్తి శేషులు కందుకూరి భాస్కర శాస్త్రిగారిది కోనసీమ లోని మోడేకుర్రు గ్రామం.
ఆయన ఉభయ భాషా ప్రవీణులు. పాఠశాలలో తెలుగు పండితునిగా పనిజేసి రిటైరయ్యాక
రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఆయనది చాల మెత్తని స్వభావం. దయార్ద్ర హృదయులు.
వయసుతో నిమిత్తం లేకుండా అర్థించిన వారందరికీ విద్యా దానం చేసేవారు.
సంస్కృతాంధ్రాలను చెప్పేవారు. ఉపనిషత్తులను, వేదమంత్రాలనూ సస్వరంగా నేర్పేవారు.
ఆయన అనారోగ్యంతో మంచం పట్టినా కూడా చదువు చెప్పడం మానేవారు కాదు.
తుది శ్వాస విడచే వరకూ విద్యా దానం చేస్తూనే ఉన్నారు.
ఆయన పరమ శివ భక్తులు. సూర్య నమస్కారాలు చెయ్యడంలో ఆయనకు
ఆయనే సాటి అని చెప్పేవారు.
ఆయన మహర్షిలా జీవితాన్ని గడిపి రాజమండ్రి లోనే పరమ పదించారు.
గురువుగారిని ౧౯౯౭ సం.లో శిష్యులందరూ కలసి స్వర్ణకంకణంతో సన్మానించారు.
ఆ సందర్భంలో ఈ శిష్య పరమాణువు వ్రాసి చదివిన పద్యాలు యివి.
శ్రీ గురుభ్యో నమః
===========
కం. దక్షిణ కోరని గురువుకు
అక్షర పుష్పముల దెచ్చి యర్చన చేతున్
సాక్షాత్తు ముగురు మూర్తులు
నక్షయమౌ కరుణ తోడ నాశాసింపన్.
ఆ.వె. కందుకూరి వంశ ఘన నభో మండల
భానుతేజ! పూజ్య! భాస్కరాఖ్య!
మిమ్ము సత్కరించు మేటి భాగ్యమ్మును
పొందినాము పూర్వ పుణ్య కతన.
సీ. అధ్యాపనమ్మునే యానందముగ నెంచి
ఛాత్రుల మలచిన స్రష్ట యితడు!
ఉపనిషత్సూక్తుల నుపదేశమును జేసి
యఘ నాశమొనరించు హరి యితండు!
అభివాద మాత్రాన నల్ప సంతుష్టుడై
విద్యల నిచ్చెడి విభుడితండు!
ధర్మానువర్తన మర్మమ్ము లెరిగిన
విమల చరిత్రుడౌ విప్రు డితడు!
తే.గీ. పరమ శివ పదాంభోరుహ భ్రమర మితడు!
భాస్కరానుగ్రహమ్మును బడసె నితడు!
సంస్కృతాంధ్రమ్ము లందున చతురుడితడు!
'గురువు'పదమునకే గొప్ప పరువితండు!
ఆ.వె. గురువు గారి చెంత కూర్చున్న చాలును
స్వరము పట్టువడెడి వరము దొరకు!
వారు కరుణ తోడ నేరుపు మంత్రముల్
భావి పదిల పరచు బాట యగును!
ఆ.వె. విద్య నేర్పుడన్న 'విత్త మేమిత్తువు'
'వలను కాదు' 'స్వరము పలుక లేవు'
యిట్టి పల్కు లెపుడు యెరుగము మీ నోట
పాఠములను చెప్పు పాటె కాని!
ఆ.వె. చెప్పువారు లేక చింతింతు రెందరో
చెప్ప గలను నేను చేర రండు
అనెడి గురువు గారి కాయుష్షనంతమై
శిష్య కోటి వృధ్ది చెందు గాత!
_ _
_: *** :_
No comments:
Post a Comment