padyam-hrudyam

kavitvam

Monday, April 11, 2016

వసంతుడు వచ్చేసాడు..

నలుదెసల్ క్రొంగ్రొత్త వెలుగులు నిండగా
...........ధరణికి శోభలు తరలి వచ్చె !
శోభిల్లు ధరణిని జూచిన పవనుండు
...........పరిమళవీచికల్ పంచ దెచ్చె !
పరిమళవీచులు పురికొల్ప పులకలై
...........ముదమున మావిళ్ళు మోసులెత్తె !
మోసులెత్తిన మావి మురిపింప కొమ్మపై
...........కోయిల కమ్మగా కూయసాగె !
కూయసాగిన కోయిల హాయి నీయ
పచ్చచీరను ధరియించె ప్రకృతికాంత!
ప్రకృతికాంతను గని తాను వలచి వచ్చె
చూడు డల్లదే వాసంతు డాడి పాడ!
*** *** ***
దుర్ముఖి యైన నేమి యిక దుర్మతి యైనను నేమి సర్వదా
ధర్మము దప్పకన్, పరుల దండన సేయక, లోకరీతిలో
మర్మము లెన్నుచున్, తగిన మాలిమి నెల్లర జూచుచుండు స-
త్కర్మపథానుగాములకు కాలము నెచ్చెలి కాకపోవునే!

No comments: