padyam-hrudyam

kavitvam

Sunday, August 31, 2014

పాపం వినాయకుడు!




చవితి పండుగంచు సంబర మేపార
నెలుక నెక్కి భువికి నేగు దెంచె
భక్తకోటి జరుపు పందిళ్ళలో పూజ 
వైభవమ్ము గన మదేభ ముఖుడు.

సినిమాల పాటలు చెవుల చిల్లులు చేయ
........... గుండె లదిరి పోయె కొన్ని చోట్ల!
డ్యాన్సు బేబీ యంచు డాబుగా నాట్యాలు
........... కురుచ దుస్తుల దాల్చి కొన్ని చోట్ల!
మోటారు బైకుపై మోడరన్ డ్రస్సులో
........... గొప్పగా తన బొమ్మ కొన్ని చోట్ల!
అదిరేటి ఎత్తులో నంతంత లడ్డుతో
........... గుంపుగా వేలాలు కొన్ని చోట్ల!

ఇంతలో పెద్ద గుంపొక టేగు దెంచె
కరకు శబ్దాల డబ్బాలు గలగలమన
చేతులను రంగు చీట్లతో చిత్రముగను
చవితి చందాల నిమ్మని స్వామి కడకు.

విస్తు బోయి " మీరు మస్తుగా పూజించు
విఘ్న నాయకుడను వినరె మీరు
స్వామి నంచు నన్ను ప్రేమతో కొలువక
ధనము నడుగ తగునె? " తాననియెను.

స్వామివైన నేమి ? సన్న్యాసి వౌ నేమి ?
ముందు డబ్బులిచ్చి ముందుకు నడు
మింత యట్టహాస మేరీతి జరిగెడి
నెవడి యబ్బ సొమ్ము లిమ్మ " నగను .

నాదు పేరున నీరీతి మేదిని పయి
నిన్ని దారుణా లగుచుండె నన్న మాట !
దంతమును పీకి వీరి నంతమును జేయ
నేక దంతుడ నైతినే యేమి చేతు ?

చేయు దారి లేక చిన్నబుచ్చుక స్వామి
రమ్ము మూషికమ్మ రయము గాను
వెనుక కేగి పోద మని పల్కి వెంటనే
మాయ మయ్యె నయ్యొ మహిని వీడి.

2 comments:

nmrao bandi said...

చాలా బాగుంది సర్ ...
అభినందనలు ...

మిస్సన్న said...

స్వాగతమ్ రావు గారూ. ధన్యవాదాలు.