padyam-hrudyam

kavitvam

Friday, April 18, 2014

బడికి పోను నాన్నా..............



వయసు మీరెనె నాకేమి? వలను గాదె 
అయిదు వత్సరాల్ నిండిన వయసు లోన 
విద్యలను నేర్వగా నాన్న? వెర్రి గాక, 
రెండు నిండి నంతనె యేల దండనమ్ము?

బుల్లి బుగ్గల పైన ముద్దుల బదులుగా
......కన్నీటి చారికల్ కలచ బోవె?
అమ్మ బువ్వకు మారు ఆయాలు తినిపించు
......యెంగిలి మెతుకులే మింగ వలెనె?
బంగారు గొలుసుతో రంగైన మెడ కింక
.......టైకట్టు బిగియింపు డాబు వలెనె?
అమ్మ నాన్నల కన్న మమ్మి డాడీ పిల్పు
.......కమ్మగా దోచునే కలత గాదె?

పాల బుగ్గల పాపపై జాలి లేదె?
బాల హక్కుల న్యాయమే కాల రాచ?
హింస మేలొకో బడిలో ? అహింస తగదె?
చెమ్మగిల్లవే మీకనుల్ అమ్మ! నాన్న?

చిన్నారి పొన్నారి చిట్టి చేతుల లోన
......బొమ్మల బదులుగా పుస్తకాలె?
అమ్మ నాన్నా యని హాయిగా గునియక
......సారుల మేడంల జేర వలనె?
గౌనులు పరికిణీల్ గాలి తగులుట మాని
......యూనిఫారాలలో నుక్క వలనె?
తాతయ్య వీపుపై తైతక్క లాడక
......నడ్డి వంగెడి బర్వు నొడ్డ వలెనె?

తెలుగు పలుకుల మానుక నలవి కాని
పెద్ద ఇంగ్లీషు మాటలు పెదవి పైన
నాట్య మాడగ ననుగని నగవుతోడ
చూతురే? చిన్ని పాపను చేతురె బలి? 

2 comments:

NSK said...

pillala antaranganni bahu chakkaga teliyaparacharu!

మిస్సన్న said...

మీ స్పందనకు ధన్యవాదాలు స్వరూప్ కుమార్ గారూ!