padyam-hrudyam

kavitvam

Sunday, November 17, 2013

భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్ప తాకమా !





బ్యాటు ఝళిపింప నరులకు భయము గల్గు
పరుగు దీసిన శతకము బాది వదలు
బంతి విసరిన నావలి యంతు జూచు
సచిను భారత మాతకు సత్సుతుండు.

విరులు మెల్లగా చల్లగా విరిసినట్లు
వెండి వెన్నెల హాయిగా పండినట్లు
సచిను నవ్విన మనసుకు సంతసమగు
నతడు భారతరత్నమే యది నిజమ్ము. 
వీరుడవై క్రికెట్టునకు విస్తృత భాష్యము జెప్పి, బ్యాట్టుతో
పోరుచు, వాడి బంతులను పూనిక వేయుచు, వైరి సోదరుల్
'లేరితనిన్ జయింప నొరు లీభువి' నంచు వచించి మెచ్చుచున్
పారగ భీరులై, భరత పావన ధాత్రికి వన్నె తెచ్చుచో
లేరిక సాటి నీ కెవరు! లీలగ నైనను కాన రారులే!
చేరియు నాటలో నెవరు చేరగ రాని మహోజ్జ్వల స్థితిన్
నేరవు సుంత లౌక్యమును! నిర్మల మైన మనస్సు నెన్నడున్
జారగ నీవు కీర్తి బల సంజనితంబగు పొంగు లోయలో!
మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
పారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్!
చోరుడ వంచు పల్కెదను సోదర మానసముల్ హరించుచో!
భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్ప తాకమా ! 

2 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

ధన్యవాదములు మిస్సన్న గారు ! ఇలా పద్యాల్లో చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది .. చాలా చాలా ధన్యవాదములు

మిస్సన్న said...

చాలా సంతోషం వంశీకృష్ణ గారూ!