padyam-hrudyam

kavitvam

Friday, November 1, 2013

తెలుగు వెలుగు



తెనుగు భాష తీపి తేనియకును లేదు!
తెనుగు వర్ణమాల తీరు సొగసు!
తెనుగున తలకట్టు తెలుపును ఠీవిని!
దేశ భాషలందు తెనుగు లెస్స!


పాప నవ్వు వోలె పాల మీగడ వోలె
మంచిగంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విలసిల్లు జగతిని
తీపి జాలువారు తెలుగు పలుకు.


తెనుగు మాటలందు, తెనుగు పాటలయందు,
తెనుగు పద్యమందు తెలియనగును
తెనుగు సౌరభమ్ము! పునుగు జవ్వాదుల
యునికి గుండు సున్న తెనుగు ముందు!


తెలుగు రాని వాడు, తెలుగు నేర్వని వాడు,
తెలుగు పలుకుబడుల తియ్యదనము
తెలుగు నేల బుట్టి తెలియని మూర్ఖుడు
గలుగ తెలుగుతల్లి కడుపు చేటు!


తెలుగు పద్య మన్న వెలలేని బంగరు
పాత్ర నున్న యమృత ఫలము సుమ్ము! 
మనసు పడిన వారి కనుపమ మధురమౌ
రసము లూర జేయు రసన పైన!


వస్తువెట్టిదైన వర్థిల్లు తెలుగున
పద్యమందు నొదిగి, బంగరంపు
టుంగరమున రత్న మొదిగిన రీతిగా!
పోతబోయ బడిన బొమ్మ వోలె!


మలయ పవన వీచి! మకరంద బిందువు!
పాల కడలిని యల! పూల మాల!
మింటి మెరుపు తీవ! మెరసెడు తారక!
తెలుగు కైత సొగసు తెలుప వశమె!


పద్యము తెల్గు భారతికి పచ్చల హారము కంఠ సీమలో!
హృద్యము దీని సోయగము నింపులు సొంపులు! కావ్య సీమలన్
సేద్యము జేయు వారలకు శ్రీల నొసంగెడు పైరు! స్వంతమౌ
విద్యది తెన్గు వారలకు! విత్తము సత్కవి కెన్న నిద్ధరన్!


వేల వత్సరాల వెనుకనే ప్రభవించి
దీప్తు లీను చుండె తెలుగు ధాత్రి,
మాటలందు లిపిని మార్పులు జరిగిన,
మధురిమలను పంచు మనకు తెలుగు.


3 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుందండీ ..

వస్తువెట్టిదైన వర్థిల్లు తెలుగున
పద్యమందు నొదిగి, బంగరంపు
టుంగరమున రత్న మొదిగిన రీతిగా!
పోతబోయ బడిన బొమ్మ వోలె!

చక్కటి పద్యం .. దత్త పది లో ఏ భాషా పదాలైనా చక్కగా ఇమిడి పోతుంటే ఈ భాష ఎంత గొప్పది అనిపిస్తుంది ... చక్కటి పద్యం .. ధన్యవాదములు

మిస్సన్న said...

వంశీకృష్ణ గారూ! స్వాగతం! మీ రన్నది నిజం. దత్తపది ప్రక్రియ లో ఎలాంటి పదాలనైనా పద్యంలో ఇమిడ్చి చెప్పవగలరు సమర్థులైన కవులు. బహుశా ఇలాటి సౌకర్యం ఇంకే భాషలోనూ ఉండదేమో. ధన్యవాదాలండీ.

dokka srinivasu said...

Missanna gariki

Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.

Missanna garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.

Missanna garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.

http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

Missanna garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.

Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

Missanna garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.

Missanna garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.