చల్ల గాలి తెరలు మెల్లగా వీచును
మల్లె పూల తావి మత్తు గొలుపు
కోయిలమ్మ పాట తీయగా మనసుకు
సంతసమ్ము నిడు "వసంత" వేళ!
***************************
ఎండ మండి పోవు నెఱ్ఱనై సూర్యుండు
గుండె లదర గొట్టు గుబులు హెచ్చు
ఉస్సు రుస్సు రంద్రు నూరూర జనములు
"గ్రీష్మ" తాప మిట్టి రీతి నుండు.
***************************
చిట పటంచు వాన చినుకులు రాలును
ఏడు రంగులీను నింద్ర ధనువు
బీద బిక్కి వార్కి పిడుగు పాటై యొప్పు
"వర్ష" ఋతువు మేలు కర్షకులకు.
***************************
రెల్లు దుబ్బు విరియు తెల్లని పింజలై
నిండు చందమామ నింగి వెలుగు
ప్రకృతి పులకరించు పారవశ్యమ్మున
"శరదృతువు" న పుడమి సంద డించు!
****************************
మంచు బిందు చయము మంచి ముత్యము లట్లు
మెరయు బాల భాను కిరణములకు
చలికి ముసుగు తన్ని సాగెడు వారికి
మంచి సుఖము యీ "హిమంత" మందు!
*****************************
ఆకు రాల్చి చెట్లు ఆశతో చూచును
క్రొత్త చివురు తొడుగు కోర్కె తోడ
రేపు మంచి దంచు రేపుచు నాశల
వశము చేసి కొనును "శిశిర" ఋతువు!
*****************************
కాల దివ్య చక్ర గంభీర గమనాన
చీకటైన వెనుక చిందు వెలుగు
కష్ట సుఖము లిట్లె గమియించు బ్రదుకున
ఎరుక సేయు "ఋతువు" లిట్టి నిజము.
(ది. 8-6-1996 న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన నా కవిత)
re
3 comments:
చాలా బాగుంది ఋతుసందేశం.
శిశిర ఋతువు నెంత ఆశావహ దృక్పథం తో చెప్పారు!!
మందాకిని గారూ స్వాగతం,
మీ సందర్శనతో నా బ్లాగు పులకించింది.
ధన్యవాదాలండీ.
మాష్టారూ...చాలా అందంగా పొందికగా రాశారు... అత్యద్భుతం... నేను వీటిని నా students ki nerpavachunaa?
Post a Comment