padyam-hrudyam

kavitvam

Thursday, May 5, 2011

చిన్మయ రూపిణీ!




















మన్మనమందు షడ్రిపులు మాన్యత బాయగ నుద్యమించుచున్
సన్మతి బాపు చుండెడిని సంతతమున్ భువనేశ్వరీ! కటా!
కన్మని నీకు మ్రొక్కగను కాయము వంగ దదేమి చేయుదున్?
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

4 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా! మిస్సన్న గారూ! నమస్తే.
మీ ప్రొఫైల్ చూచి, మీ బ్లాగును గుర్తించి చదివి, ఆనందించాను.

వర దువ్వూరి కులోద్భవా! నరహరీ!భవ్యాత్మ! మీ పద్యముల్
ధర హృద్యంబన నొప్పియుండె కనగా. ధన్యాత్మ! యాదేవి మీ
మొరలాలించును.శత్రు షట్కమును తా మూలంబుగా బాపు. ధీ
వర! మీ పద్యము హృద్యమై తనరుచున్ వర్ధిల్లఁ జేయున్ మిమున్.

మా స్వగ్రామం యలమంచిలి ప్రక్కనే ఉన్న సర్వసిద్ధి గ్రామం.
ఈ నెల 20వ తేదీన ఆ ప్రదేశానికి వస్తున్నాను. పది రోజుల పాటు ఆ ప్రాంతంలో ఉంటాను కాబట్టి మిమ్ములను ప్రత్యక్షంగా చూడ గలనని ఆశిస్తున్నాను.
నా సెల్ నెంబరు 9247238537.
http://andhraamrutham.blogspot.com
నెనరులు.

మిస్సన్న said...

పూజనీయ రామకృష్ణా రావు గారూ ప్రణామములు. మీ వేగు చూచి చాల ఆశ్చర్య పోయాను.
ఎందుకంటే మీ బోటి పెద్దల, సరస్వతీ స్వరూపుల సరసన నిలబడటానికి కూడా అర్హత లేని, నా, పద్యాన్ని మెచ్చుకొని మీరు ఆశీస్సులంద జేయడం నా పురాకృత పుణ్య ఫలమై ఉంటుంది.
మీరు ఈ ప్రాంతానికి చెందినా వారవడం, ఇటు వైపునకు రా బోవడం నా అదృష్టం.
మిమ్మల్ని కలుసుకొనే శుభ తరుణం కోసం ఎదురు చూస్తూంటాను.
భవదీయుడు - మిస్సన్న.

హనుమంత రావు said...

షడ్రిపులంటే అరిషడ్వర్గాలనే కదా...కాపోతే సవరించండి....అందరూ నిన్ను పద్యాలతో ప్రస్తుతిస్తుంటే, ఇతడు మాకు స్నేహితుడు...హితుడు అని బయటినుంచైనా చెప్పుకోగలగడం ...నా అదృష్టానికి మురిసిపోతున్నాను...అమ్మను ప్రత్యక్షం చేస్తున్నావు...చాలా బాగుంది....

మిస్సన్న said...

అయ్యా గురువుగారూ హనుమంతరావు గారూ! శతాధిక వందనాలు. విద్యా భాస్కర పుత్రులను సవరించాల్సిన అవసరం ఉందంటారా? మీబోటి సత్పురుషుల సాంగత్యమే నాకు ప్రేరణ. విజయలక్ష్మి గారు కీర్తనలనే వ్రాసేస్తూంటే ఆమాత్రమేనా కుస్తీ పట్టవద్దా పద్యాలతో ? మీ ప్రశంసలు మరీ ఆకాశాని కేత్తేస్తున్నాయి. ధన్యవాదాలు. భవదీయుడు-సుబ్బారావు.