padyam-hrudyam

kavitvam

Saturday, February 6, 2021

సుందరవిజయం 10

 

హనుమంతుడు మండోదరిని జూచుట 

మ.

హనుమంతుం డొక రత్న సంభరిత పర్యంకంబు నీక్షించె, దా
నిని దంతమ్ములు  పైడితోఁ బొదిగి వన్నెల్ మీర వజ్రాల  కో
ళ్ళను బట్టీలను గూర్చి మంచి పరపుల్ రమ్యాంబరాలంకృతం
బున శోభిల్లగ మాలలన్ శిరము వైపుం జుట్టి రందమ్ముగా.                     10-1

తే.గీ.
చంద్ర సన్నిభమౌ సితఛ్చత్ర మొకటి
పైడి కామతో మాలలఁ గూడి సూర్య
కాంతితో వెల్గ, నిల్చిరి  కరములందుఁ
జామరమ్ముల విసరుచు భామ లచట.                                                    10- 2

సీ.
ఇరవైన కుండలా లెర్రని కన్నులు
.........గాంచన చేలముల్ గలుగు వాఁడు
చందన చర్చతో సంధ్యారుణచ్ఛవుల్
.........దీపించు మేఘము దీరు వాఁడు
నిద్రించు మందర నిర్ఝరియై యొప్పి
 ........యాభరణమ్ముల నలరు వాఁడు
స్త్రీలతోఁ గ్రీడించి ప్రాలుమాలి పరుండి
......... త్రాగిన మత్తులోఁ దనరు వాఁడు

తే.గీ.
రాక్షస స్త్రీల ప్రియుఁడును రక్కసులకు
మేలుఁ గూర్చెడి వాఁడును మేటి పాము
వోలె నిశ్వసనమ్ములఁ గ్రాలు వాఁడు
నైన రావణుఁ డా శయ్య పైన పండె.                                                          10- 3

తే.గీ.
ఇంద్రచాపము లవి యెన్న, నినుప గదలు,
బ్రక్క పై ప్రాకుచున్నట్టి భయదమైన
పంచ శిరముల పాములు, బలిసి యున్న
బాహువులు కల రావణుఁ బావని కనె.                                                       10- 4

తే.గీ.
పర్వతము వంటి రావణ ప్రభువు మించు
బాహువుల తోడ భాసిల్లె భవ్యమైన
శిఖరములనొప్పు మందర శృంగి వలెను
వాయు సూనుఁ డచ్చెరు వొందె వానిఁ జూచి.                                          10- 5

సీ.
చందన చర్చతో స్వర్ణ హారాలతో
.......విపుల  వక్షఃస్థల విభవ మలర
శ్వేతోత్తరీయముం బీతాంబరములతో
.......మినుముల రాశియై తనువు దనర
భాగీరథికి మధ్య పడుకొన్న మదగజ
.......ప్రాభవ దర్పమ్ము  బరిఢవిల్ల
బంగరు దివ్వెలు ప్రసరించు వెల్గుల
.......మెరపులు గూడిన మేఘ మనగ

తే.గీ.
మణులు ముత్యాలు వొదిగిన మంచి స్వర్ణ
మకర కుండల ద్వయముచే  మండితమయి
నిద్రలోఁ బ్రక్క కొరిగిన నెమ్మొగాన
నొప్పు రావణుఁ గనుగొనె నుత్సుకతను.                                                10- 6

తే.గీ.
సుంద రాస్యలు, వాడని సుమ సరములఁ
దాల్చు నెలఁతలు, నగలతోఁ దళుకు మనుచు 
నృత్య గీతాది కళలలో నేర్పరు లగు 
భార్య లతని కాళ్ళకుఁ జెంతఁ బండుకొనిరి.                                         10- 7

సీ.
నాట్య ప్రవీణయౌ నాతి యొకర్తుక
........నాట్య భంగిమ లోనె నడుము వాల్చె
వైణికురాలైన వనిత యొకర్తుక
........వీణ కౌగిట నుండ మేను వాల్చె
తప్పెట వాయించు తరుణి యొకర్తుక
........పట్టి చేతనె దాని పవ్వళించె
వేణువు నూఁదెడి వెలఁది యొకర్తుక
........గుండెల దానితోఁ గునుకుఁ దీసె

తే.గీ.
పొంకమౌ యంగములతోడ బొదివికొని మృ
దంగమును బండె నొక చాన, దాల్చి యొకతె
డిండిమము నొక చేత వేరొండు కౌగి
లింతఁ బండె, నీ రీతి నిద్రించి రచట.                                                10- 8
 
తే.గీ.
స్వకుచ యుగమును గట్టిగాఁ బట్టినదియు
సోలి తమకాన సవతినిఁ జుట్టినదియుఁ
బతిని వలె వాద్యముల హత్తి పట్టినదియు
మత్తులో నున్న మగువల మారుతి కనె.                                             10- 9

తే.గీ.
అంత దూరాన దివ్య పర్యంక మందుఁ
బండుకొని నిద్ర లోనున్న పడతి నొకతె
నా భవంతికి వెలుగిచ్చు నందగత్తె
నాంజనేయుఁడు వీక్షించె నంతలోనె.                                             10- 10

చం.
మణులును ముత్యముల్ మెరయు మంచి విభూషలఁ దాల్చి, దివ్యమౌ
ఘనతర తేజ సంజనిత కాంతుల సౌధము నింపుచున్, మహ
త్కనక సువర్ణయైన దశకంఠుని పట్టపు రాణియౌ ప్రియాం
గనయును, సుందరాంగి యగు కాంతను బావని జూచి మెచ్చుచున్.  10- 11

కం.
కని మండోదరి నింతిని
ఘనభూషలఁ దాల్చి మించు కాంతా మణినిన్
వనచరుఁ డానందముతోఁ
గనుగొంటిని సీతననుచు గంతులు వేసెన్.                                          10- 12

ఆ.వె.
బుజము లప్పళించె, ముద్దాడె తోకపై,
నటును నిటును గెంతె, నట్టె దూకె
నెక్కి కంబములను, హే యని సాజమౌ
కోతి లక్షణములఁ గూడి హనుమ.                                                          10- 13

No comments: