padyam-hrudyam

kavitvam

Monday, November 4, 2019

శబర శంకర విలాసం





కీ.శే. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారి శబర శంకర విలాసము అనే కావ్యము నుండి : మొదటి భాగం.

ద్వైతవన వర్ణనము:

ఉ.
శ్రీఫల పారిభద్ర బదరీ క్రముక ప్రియ కాశ్వకర్ణ ధా
త్రీఫలినీ శమీ వట శిరీష తమాల విభీత కాది నా
నాఫల పుష్ప వృక్ష జననక్షమమై యమృతేందిరాక్ష కే
ళీ ఫలకాయితం బయి తలిర్చును ద్వైతవనం బిలాస్థలిన్.

మారేడు, దేవదారు, రేగు, పోక, మద్ది, ఉసిరి, జమ్మి, మఱ్ఱి, శిరీష, చీకటి, వేగిస మొదలైన అనేక రకములైన వృక్షములతో నిండి ద్వైతవనం శోభిల్లుతోంది.

అటువంటి ద్వైతవనం లో శ్రీవిద్యోపాసకులైన మునులు వేదాలు అనే సముద్రాన్ని బుద్ధి అనే మందర పర్వతంతో మథించి దాన్లోంచి వచ్చే సారం అనే అమృత ధారలను శిష్యకోటి చేత త్రాగిస్తూ జగక్షేమ కరంగా కొలువై ఉంటారు.

ఏదో సేలయేరో లేకపోతే జీవనదో ప్రవహిస్తూ ఉంటే దాని ఒడ్డున పర్ణశాలలను నిర్మించుకొని ఇహలోక సౌఖ్యాల పైకి మనసును పోనీక, పారలౌకిక సుఖ వాంఛ లేకుండా ఆ మహర్షులు జీవిస్తున్నారు.  ఎందుకంటే వారికి సంచిత పాపా లేమీ లేవు అందుచేత పారలౌకిక సుఖాలపై కూడా ఆసక్తి లేదు. అంతటి మహానుభావులు.

ఆ మునులు చేసే యజ్ఞయాగాదుల వలన వచ్చే పరిమళాలు దేవతలకు చాల సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ హోమాగ్ని ధూమాల వల్ల పొగచూరిన చుట్టుప్రక్కల లతలు, పొదరిళ్ళు నల్లగా ఉండి భూమికి దిగివచ్చిన మేఘాలో అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ఋషులు శివాభిషేక సమయంలో చేసే శతరుద్రీయ ఘోషలు ఆకాశాన్నంటుతూ ఆనందాన్ని ఇస్తున్నాయి. విరిసిన పువ్వుల సమూహాలు తేనెతో నిండి వాటిపై వాలే తుమ్మెదల ఝన్కారాలు ప్రణవోపాసన చేస్తున్నట్లుగా ఉంది. బ్రహ్మచారులు పెట్టే దర్భలను తిని, ముని కన్యలు ఇచ్చే తీయని నీటిని త్రాగి చెట్ల నీడల్లో నెమరు వేస్తూ కునుకు తీస్తూన్న లేళ్ళు ఆ ఆశ్రమాలలో కనిపిస్తున్నాయి.

కంద మూల ఫలాలతో అతిథి అభ్యాగతులను తృప్తి పరచే ఆతిధేయులు, ఫలాలతోను,దళాలతోను, పువ్వులతోను ఆచార్య పాదాలను సేవించే బ్రహ్మచారులు, సుఖ దుఃఖాను భూతులను ఒకేలా అభ్యసించడం వల్ల అక్కడి సాధు క్రూర మృగాలు అద్వైతాన్ని పాటిస్తున్నవో అన్నట్లు, చెట్ల నీడల్లో చదువుకొనే శిష్యుల పాఠాలను చెట్ల కొమ్మలమీద ఉండే చిలకలు చక్కదిద్దుతూనూ కనిపిస్తున్నాయిట అక్కడ.  యాగాలు చేసే మహర్షులు ఆయా విధానాల్లో ఉండే మంత్ర తంత్రాలపై విచారణ జరుపుతూ ఉండడం, సగుణ నిర్గుణ బ్రహ్మ ప్రసంగ సన్నియోగములు అక్కడ సామాన్యమైన సంగతి.

ప్రభాత సమయాల్లో తోకలు ఊపుకుంటూ చెలవలంపట నురుగులు కారుతూ గాలికి ఎగురుతూ ఉంటే తల్లి ఆవుల పొదుగులను కుమ్మేస్తూ పొదుగులను కరిగించేస్తూ పొట్టలు నింపుకొంటూ ముచ్చట గొలిపేలా అటు ఇటు పరుగులెడుతున్నాయి గోవత్సాలు.

మూర్తీభవించిన శాంతమా అన్నట్లు కనిపించే మహర్షులు శ్రుతులు, స్మృతులు చెప్పే ధర్మ కర్మాలను ఆచరించడమే కాని ఆ కర్మల పట్ల కర్తృత్వము కాని భోక్తృత్వము కాని తలపోయరు. వారి నిష్ఠ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇక ముని కన్యకలు వేకువనే లేచి పర్శాణలలను శుభ్రం చేసి ఏటికి వెళ్లి బిందెలతో నీళ్ళు తెచ్చి లతలకు, మొక్కలకు పోసి అప్పుడు ముంగిళ్ళలో ముగ్గులు పెడుతూ ఉంటారు.

ఆ ఋషి పత్నులు పాతివ్రత్యంలో సతీ అనసూయకే పాఠం చెప్పగల సమర్థులు. మహర్షులు అరిషడ్వర్గమును మర్దించే కళలో శమాది షట్కాన్ని ఆయుధంగా ధరించిన ఆరితేరిన వారు.వేదమూర్తులైన బ్రహ్మచారులు బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ బాలభాస్కరుల్లా ప్రకాశిస్తున్నారు. బాలికామణులు శివుని పెండ్లి ఆడడానికి ఎదురుచూసిన గౌరీ దేవుల్లా మెరిసిపోతున్నారుట.  (సశేషం)