padyam-hrudyam

kavitvam

Monday, April 8, 2019

ఉగాది 2019


7-4-2019 న అమలాపురం కామాక్షీ పీఠం లో జరిగిన అనంతచ్ఛంద గ్రూపు సభ్యుల కవిసమ్మేళనం లో నేను వ్రాసి చదివిన పద్యాలు:

మ.

శ్రీ కాంచీ నగరీ విహార రసికా! శ్రీచక్ర సంచారిణీ!
ఏకామ్రేశ్వర మానసాబ్జ నిలయా! హ్రీం మంత్ర బీజాత్మికా!
రాకాచంద్ర సమాన దివ్య వదనా! రాజాధిరాజేశ్వరీ!
శ్రీకామాక్షి! పరాత్పరీ! ప్రణతులో శ్రీమాత! నన్నేలుమా!

ఆది:

నిశలు కృశించ సాగినవి నెమ్మదిగా తన యుక్కు కౌగిటన్
వశ మొనరించుకొన్న హిమ వాతము లారెను భీతి తోడ నా
శిశిరము జారిపోయినది చెట్లు చిగిర్చెను పూలు పూచె న
ల్దిశలు వెలుంగ జొచ్చినవి  దివ్యముగా సు వికారి రాకకై........1

నలుదెసల్ క్రొంగ్రొత్త వెలుగులు నిండగా
...........ధరణికి శోభలు తరలి వచ్చె !
శోభిల్లు ధరణిని జూచిన పవనుండు
...........పరిమళవీచికల్ పంచి పెట్టె !
పరిమళవీచులు పురికొల్ప పులకలై
...........ముదమున మావిళ్ళు మోసులెత్తె !
మావిళ్ళు మోసెత్తి మరిపింప కొమ్మపై
...........కోయిల కూయగా గొంతు నెత్తె!

కూయసాగిన కోయిల హాయి నీయ
పచ్చచీరను ధరియించె ప్రకృతికాంత!
ప్రకృతికాంతను గని తాను వలచి వచ్చె
చూడు డల్లదే వాసంతు డాడి పాడ!.............2

రమ్ము వికారి! డెందముల రమ్యపు టూహల ప్రోది సేయ నీ
విమ్ముగ నిమ్ము మంగళము లెల్ల జనమ్ముల కీ ధరిత్రిలో
సొమ్ములు చాలు సౌఖ్యములు శోభనముల్ చెలగంగ నన్న స్వాం
తమ్ముల మార్చవే దయకు తావు నొసంగవె మానవాళిలో.

ధర్మము నడచిన నేలను
ధర్మమునే నమ్మి భరతధర్మావన స
ద్ధర్మము నెరపెడి విభు నిడి
కర్మల గతి మార్చవే వికారీ! ప్రణతుల్.

మధ్య :

**

కరములు మోడ్చక గుడిలో
చరవాణిని చేత బట్టి సరగున పలు చి
త్తరువుల దీసిన ఫలమే?
పరమాత్ముడు మెచ్చు టెట్లు పలుకు వికారీ!

జాలిని చూపడు సతిపై
జాలపు ముఖపుస్తకమున చాన వగచినన్
చాల విచారించును కద
వేలమువెర్రిని మునింగి వీడు వికారీ!

బండెడు భారము వీపున
నుండును కరములను బాక్సు నుదకపు సీసా
బెండయి నడచును పాపడు
గుండెలు చెరువగును  చూడ గుబులు వికారీ!

రెండ్రెళ్ళెంతని యడిగిన
నుండ్రా యని గూగులమ్మ నొయ్యన నడుగున్
పండ్రెం డ్లేళ్లగు బాలుని
తండ్రియు నేమందు నేటి దత్తు వికారీ.

బడి చదువుల ప్రథముల నే
నడిగితి పాలిచ్చు నేది ఆవా ఎద్దా
నుడువుండన తడబడి రీ
బడి నీ గతి నేటి విద్య వరలు వికారీ!

పూజారి వేద విబుధుడు
బాజారున వర్తకుడును వ్యవసాయియు సూ
కా జాల రర్హు లూఢికి
రోజులు సాఫ్ట్వేరు కివ్వి రూఢి వికారీ.

కన్నెల తలిదండ్రుల నా
డెన్నో కష్టాల బెట్టి హింసించిరిగా
నిన్నను, నేడో మరి యా
కన్నెలదే గాలి కల్ల కాదు వికారీ.

పెద్దల కన్నము బెట్టక
పెద్దగ పఠియించు వేయి విష్ణువు పేర్లన్
సుద్దులు చెప్పును పూజలె
ముద్దని యది పుణ్య మెట్లు ముద్దు వికారీ!

తద్దినముల యూసెత్తక
పెద్దల యాచారములను పెడచెవి నిడుచున్
గద్దరి శ్రీమాతా యని
పెద్దగ నామముల పాడ పెంపె వికారీ?


ఇట్టి వికారములే కను
పట్టును సంఘమున నెట్టి పట్టున నైనన్
మొట్టెదవో కొట్టెదవో
తిట్టెదవో మార్చ వలయు తీరు వికారీ!

అంతం :

అమలాపురము పల్కులమ్మ కాపురముగా
.....విమల యశస్వియై వెలుగు గాక
కోనసీమ వసంత కోకిలాకరముగా
.....కుహుకుహూ రాగాల కులుకు గాక
తూర్పుగోదావరి తోటి కోటుల శుభ
.....తోరణమై తులతూగు గాక
ఆంధ్రప్రదేశము హాయిగా తెలుగుల
.....కానంద నిలయమై యలరు గాక

భరతధాత్రిని ధర్మము ప్రబలుగాక
వసుధ యేక కుటుంబమై వరలుగాక
ఎల్ల లోకాల సుఖశాంతు లెలయుగాక
కోరి దీవించవమ్మ వికారి! నతులు.

తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లి
జనుల నాల్కల నానుత సతము, నాంధ్ర
పద్య కవితా సదస్సు సంపన్న మగుత,
తెలుగు నుడులను జగమెల్ల వెలుగు లగుత.

జయమగు గాక ధారుణికి, చల్లగ దప్పిక దీర్చు నీటికిన్!
జయమగు గాక నగ్నికిని, సన్నగ మెల్లగ వీచు గాలికిన్!
జయమగుగాక మింటికిని, సర్వ చరాచర ప్రాణికోటికిన్!
జయమగుగాక సద్ద్విమల సజ్జనకోటుల కీ వికారిలో.


2 comments:

ఊకదంపుడు said...


మూడు ఖండికలూ చాలా చక్కగా ఉన్నాయండీ. పంచుకున్నందుకు ధన్యవాదములు.
వికారి ఉగాది వేళ వచ్చిన ఇంతసమగ్రమైన ఖండిక మరొక్కటి నేను చూడలేదు.

మిస్సన్న said...

మీ సహృదయ స్పందనకు ధన్యవాదములు ఊకదంపుడు గారూ.