padyam-hrudyam

kavitvam

Monday, March 7, 2016

శివకల్యాణం

భూతసంఘమ్ములుభీతిని కల్గింప
.........గిరిబందు లరసిరి కిక్కురనక
తారకాసురునకు దగ్గరపడెనని
.........సురలు మింటను జేరి మురిసిపడిరి
ఒక యింటివాడయ్యె నిక చింతలేదని
.........ప్రమధులు తనిసిరి ప్రభువును గని
వలచిన నాథుని తిలకించి శైలజ
.........తలవంచె సిగ్గుతో తత్తరపడి

పుఱ్ఱె దండల పై వైచె పూలమాల
శివుని కంఠాన పార్వతి శిరము వంచి
తనను గెలిచిన తరుణిని తరచి చూచి
తల్లి దొరకె జగతి కని తలచెశివుడు.

**************************************

పులితోలు మారెను కలికి తాకినయంత
........కనకచేలముగ శంకరుని మేన
సర్పహారమ్ములు చక్కగా సురసాల
........పుష్పదామములాయె పురహరునకు
శవభస్మ చారికల్ క్షణములో పరిమళ
.......చందన చర్చగా జ్వాలి కమరె
చిచ్చర కన్నాయె ముచ్చట గొలిపెడి
.......బొట్టుగా నొసటను భూతపతికి

పార్వతీకరగ్రహణపర్వంపు వేళ
విరియ ముక్కోపి మొగములో చిరునగవులు
అజుడు శ్రీహరి గుసగుస లాడిరంత
నెంత వారలు దాసులే కాంత కనుచు.


No comments: