padyam-hrudyam

kavitvam

Thursday, January 8, 2015

తొలగి పొమ్మన ధర్మమే తెలుపు డయ్య................



ఆది శంకరు లొక్కనా డఖిల శిష్య
గణము వెంటరా జనుచుండ గంగ వైపు
శ్వపచు డొక్కడు నాలుగు శ్వానములను
వెంట గొని యెదు రాయెను వికృత గతిని.
శిష్యు లంతట వానిని చీదరించు
కొనుచు దారిని తొలగంగ కోరినారు
శంకరులు దాని గమనించె, శ్వపచు డనెను
విస్తు పోవగ నది విని వేత్త లపుడు.
బాప లార మీరెవ్వని బాట విడచి
తొలగు మనుచుండ్రి దేహినా? తొలుత నుండి
దేహమున నున్న యాత్మనా తెలుపు డయ్య
వేదవేత్తలు మీరెన్న వివరముగను.
ఎల్ల జీవుల లోనుండు తెల్లముగను
నాత్మ రూపియై పరమాత్మ యనుచు తెలిసి
యంట రాని వాడని నన్న నాదరమున
తొలగి పొమ్మన ధర్మమే తెలుపు డయ్య.
తెలిసి యద్వైత తత్త్వమ్ము తెల్లముగను
వాడు వీడను భావమ్ము వీడ వలదె
యనిన శ్వపచుని పల్కుల వినిన శిష్యు
లకు మదిని క్రమ్ముకొను పొరలంత మాయె.
శుష్కాంతరముల మనమ
స్తిష్కమ్ముల నుండి మాప శివుడే తానా
విష్కర్తగ చనుదెంచెను
నిష్కృతి చూపింప నాల్గు నిగమమ్ములతో.

3 comments:

కంది శంకరయ్య said...

చక్కని ఖండిక. చాలా బాగుంది. మీకు నా అభినందనలు.

మిస్సన్న said...

గురువుగారూ! మీ సౌజన్యంతో వ్రాసినవే యీ పద్యాలు. ధన్యవాదాలు.

మిస్సన్న said...
This comment has been removed by the author.