padyam-hrudyam

kavitvam

Saturday, April 13, 2013

పుట్టినిల్లు వనిత పుణ్య భూమి!



















ఊరి దాపుకు జేర యురక లెత్తును మది!
...............బడి భవనమ్ములు పలకరించు!
చెరువుగట్టును జూడ చిత్తమ్ము పొంగును!
..............గ్రామ దేవత గుడి క్షేమ మడుగు!
సంతపాకలు గన సంతసమ్మొదవును
..............చావడి, కూడలి రావె యనును!
పలకరింపు కుశల ప్రశ్నల తాకిడి
.............ముసురుకొనగ నెంతొ మురియు మనసు!

వీధి లోకి నేగ వేడుక ముంచెత్తు
అల్లది గదె పుట్టి నిల్లు తనది
బండి యాగి నంత వాకిట ముంగిట
చెంగున దిగె నమ్మ చేటి గనుడు!


చిట్టి తల్లీ రావె చిక్కిపోయే వేమి?
..............కన్నతల్లి పలుకు కడుపు నింపు!
అమ్మలూ వచ్చేవ అల్లుడు కుశలమా?
..............నాన్న పలకరింపు వెన్న పూస!
నను మరచే వేమొ నాకేమి తెచ్చేవు?
.............తమ్ముడు గారాబు కమ్మదనము!
ముందు దిష్టిని తియ్యి మురిపాలు తర్వాత!
............నాయనమ్మ సలహా హాయి నిచ్చు!

తాత బోసినవ్వు! తల నిమిరెడు చెయ్యి!
పుట్టినిల్లు వనిత పుణ్య భూమి!
భర్త ప్రేమ తోడ పట్టమ్ము గట్టినన్
దాని సాటి గలదె ధరణి లోన?


ఇంటి ముంగిటిలోన యెప్పుడో పెట్టిన
..............పడి మీది ముగ్గులు పలకరించు!
పెళ్లి ముందటి దాక పెరటిలో పెంచిన
..............గుబురు మల్లెల పొద కుశల మడుగు!
బావియొద్దకు జేరి బాల్చితో తోడిన
.............చల్లని నీరాన యుల్ల మలరు!
వేప వృక్షము క్రింద చాపపై పడుకొని
.............కూని రాగము తీయ కోర్కె గలుగు!

నాటి జ్ఞాపకాల నవ్యానుభూతులు
తడుము నెదను వెన్ను తట్టు నెపుడు!
మెట్టి నిల్లు యెంత మిన్నదైనను గాని
నాతి పుట్టినిల్లు నాకమె యగు!

2 comments:

Karthik said...

చాలా బావుంది సార్...నిజంగా మీ పద్యం చదువుతుంటే మా ఊరే గురుతు వచ్చింది.

మిస్సన్న said...

ధన్యవాదాలు ఎగిసే అలలు గారూ! స్వాగతం.
ఒకప్పటి మన ఊళ్ళన్నీ అంత అందంగానూ ఉండేవి.
వెర్రి తలలు వేస్తున్న నేటి నాగరికత ఆ అందమైన చిత్రాన్ని ఛిద్రo చేస్తోంటే చాలా బాధగా ఉంటుంది.