ఇన్మును జూచి కాంచనము నిట్టె త్యజించెడు వెఱ్రి కైవడిన్
పెన్మమకారపుం బొరలు పేర్కొని యుండగ నాలుబిడ్డలన్
సన్మతి గల్గ బోదు మది చక్కగ నిన్ను స్మరింప భార్గవీ!
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!
పచ్చదనం పరిశుభ్రత - పాటిద్దాం మనమంతా
పరిమళమూ పవిత్రతా - పంచుదాము భువినంతా ... పచ్చదనం
ఇంటింటికి ఒక మొక్కను - నాటి మనం పోషిద్దాం
ఆంధ్రావని ఎల్లెడలా - హరితవనం చేసేద్దాం ... పచ్చదనం
నువు నాటే ప్రతి మొక్కా - రేపటి చెట్టౌనందాం
నువు నరికే ప్రతి చెట్టూ - శపియించుట నిజమందాం ... పచ్చదనం
అతి వృష్టీ అనా వృష్టి - కిచట తావు లేదందాం
కరవు కాటకాల కికను - చెల్లు చీటి వ్రాసేద్దాం ... పచ్చదనం
వృక్షో రక్షతి రక్షిత - యన్న సూక్తి నిజమందాం
పచ్చదనం పరమాత్ముని - ప్రతిరూపం అనుకొందాం ... పచ్చదనం
ఆంధ్రమాత కాదరాన - హరితాంబర మందిద్దాం
తీయని నూరూ గాలీ - ఆమె కిచ్చి మురిపిద్దాం ... పచ్చదనం
ఆనందం ఆరోగ్యం - అంతటనూ నింపేద్దాం
ఆంధ్ర భూమి భరత ధాత్రి - అమర ధామ మనిపిద్దాం ... పచ్చదనం
జన్మము నెత్తి నాది భవ జాలము నందున చిక్కి తమ్మరో !
మన్మథ దగ్ధ లోచనుని మాలిమి ప్రేయసి ! మంద హాసినీ!
జన్మ నొసంగ నేల? కడు సంకటముల్ సృజియించ నేలనే ?
చిన్మయ రూపిణీ నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా !
మన్మనమందు షడ్రిపులు మాన్యత బాయగ నుద్యమించుచున్
సన్మతి బాపు చుండెడిని సంతతమున్ భువనేశ్వరీ! కటా!
కన్మని నీకు మ్రొక్కగను కాయము వంగ దదేమి చేయుదున్?
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!