శ్రీ దత్తాత్రేయ వేదవిద్యా గురుకులం, కొంతమూరు, రాజమహేంద్రవరం
************************************************************************
చం. నలుబది నాల్గు పన్నముల నాలుగు దిక్కులు పిక్కటిల్లగన్
తొలిపలుకమ్మ మోము విడ తోషము తోడను జూచువారికిన్
బులకలు రేగ దేహముల బొల్పగు దీక్షను వేదపండితుల్
సలిపి యజుస్సునన్ ఘన యజమ్మును మించిరి ధన్యజీవులై.
చం. పదియును నారు మంది ఘన పండితు లొక్కెడ జేరి పుస్తకం
బెదియును ముట్టఁబోక తమకే తగు ధారణ పైన నమ్మికన్
వదలక యొక్క మంత్రమును బాడుట కృష్ణయజుస్సు నెల్ల ము
ప్పది దినముల్ దినమ్మునకు బట్టుగ నెన్మిది గంట లబ్రమౌ.
చం. కుదురుగ నొక్క భంగిమను గూర్చొని యాసన మందు దీక్షతో
వదనములందు చూపులను వాక్కుల వేసటఁ జూపబోక ష
ట్పదములు పూవులందు మధు పానము జేసెడి వేళ మోదమున్
గదలక తన్మయత్వమున గార్యము సల్పెడి యట్లు దోచెడిన్.
చం. మరువక ముందు వెన్కలకు మార్చక మంత్రములందు స్థానముల్
స్వరముల నౌను కాదనుచు సల్పక వాదము లెంత మాత్రమున్
బరు విడు స్వర్నదీ ఘన ప్రవాహము వోలెను సాగె నంతయున్
తరమొకొ వేదవిద్వరులు దక్కిన వారల కిట్టి విద్దియల్.
సీ. ఎవరు వచ్చితి రిట యెవరు కూర్చుండిరి
...యెవరు వెళ్ళితి రను యెరుక లేదు
కాల మెంతాయెను కతుకుట యెప్పుడు
...విశ్రాంతి యెపు డను వెరపు లేదు
కదలక కూర్చుండ కాళ్ళు నెప్పులు వచ్చె
...చాలు పోవుద మన్న సడులు లేవు
తడుముకొనుట గాని వడి తగ్గుటయు గాని
...సుంతైనఁ దోపదు వింతగాను
తేగీ. విసుగు గనరాదు వేసట చాయ లేదు
ఒక్క గొంతుగా స్వరముగా నొదిగి సాగె
మొదటి దినపు టుత్సాహమ్ము మొత్తము నెల
తొలిచదువు సూరులందున తుదివరకును.
కం. రాజమహేంద్రవరమ్మున
నీ జగతీమంగళేష్టి యెపుడో జరిగెన్
మా జన్మలు తరియించఁగ
నీ జన్నము మరల జరిగె నీ గురుకులమున్.