నశ్వరమైన సంపదలు నల్వురు మెచ్చెడి భోగభాగ్యముల్
శాశ్వతమంచు వేడెదరు సత్యము నేరగ లేక మూఢులై
విశ్వమునందు సర్వమున వెల్లడియౌ భవదీయ తత్త్వమున్
విశ్వహితైషివే తెలియ వేడరు చిన్మయ రూపిణీ ! కటా!
పార్వతి పద్మ హస్తముల పండిన గోరిట కెంపు చాయకున్
శర్వుని తామ్ర కేశముల చాయకు తెల్లని మేని చాయకున్
సర్వము మారె వర్ణములు చక్కగ ముత్తెపు సేస లల్లదే
పర్వపు శోభలీనుచు కపర్ది వివాహపు వేళ కమ్రమై.
శుంభ నిశుంభ కైటభ విశుక్ర విమూఢుల రక్తబీజునిన్
శాంభవి మట్టు బెట్టితివి సంకటముల్ హరియింప సృష్టిలో
డింభకునైన నాయెదను ఢీకొన జూచెడి దైత్య షట్క సం-
రంభము నాప వేడెదను రాగదె చిన్మయ రూపిణీ ! శివా!

ఆర్తిని వారు వీరనుచు నందున నిందున పర్వులెత్తుచున్
నేర్తురె నీదు నామము గణింపగ నాపదలందు మానవుల్
చేర్తువె కష్టపుం గడలి సీమల కావల నిన్ను వేడినన్
కర్తవు కారణమ్ము క్రియ కావటె చిన్మయ రూపిణీ ! శివా!