దురితంబుల్ పలు జేసినన్, చపలతన్ దుష్టాత్ములన్ గూడినన్,
తరముల్ ముందటి తాత తాత లెవరో ధన్యాత్ములై చేయ నీ
స్మరణల్ కాచును వారి వంశజుల నే జన్మంబునందైన నో
హరిణీ! చిన్మయ రూపిణీ! దురిత దూరా! దుష్ట సంహారిణీ!
నిను దర్శించెద నీటి బిందువులలో నింజూచెదన్ నిప్పునన్
నిను భావించెద మంద మారుతములో నిన్ జూతు నుష్ణోగ్రతన్
నిను గాంతున్ తెలిమంచు వేకువలలో నిన్ గoదు నీరెండలో
కనెదన్ చిన్మయ రూపిణీ ! జగతి నిక్కమ్మెల్లడన్ నిన్ సదా.
శిష్టుడ గాను నీయెడల చిత్తము నిల్పగ లేని దుర్మతిన్
కష్టములందు నైన నిను కాస్తయు నెంచని కల్మషాత్ముడన్
స్పష్టము జేయవే కృపను చక్కగ నీ పరతత్త్వమమ్మరో
ఇష్టుడు గాడు వీడనుచు నెంచకు చిన్మయ రూపిణీ ! పరా!
జానకియై రఘూద్వహుని జాయగ నుండుట నీవు లంకకున్
వానర మూక దోడ్కొని యపార సముద్రము దాటి పోయి యా
హీనుడు రావణున్ దునిమి యెల్ల జగమ్ముల బ్రోచినాడు శ్రీ
భాను కులాబ్ధి సోముడని పల్కెద చిన్మయ రూపిణీ ! పరా!