అంబుజపాణి! నీ యభయ హస్తపు నీడన క్రీడలాడు నన్
డింభకుగా దలంచెదవొ డింగరు డంచని జాలి జూపెదో
అంబరమంటు సంబరము లంబ! శరత్తున నిన్ భజింపగన్
డంబము కాదులే శశికళాధరి! చిన్మయ రూపిణీ! శివా!
దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్
రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్
నవ్వులపువ్వులు, తియ్యనిబువ్వలు నల్వురుమెచ్చగ రమ్యముగన్!
శ్రీ మాతా! భువనైక పాలిని! సదా శ్రీ చక్ర సంచారిణీ!
సోమార్కాగ్ని విలోచనీ! సురనుతా! సోమేశ్వరాహ్లాదినీ!
వామాక్షీ! వరదాయినీ! భగవతీ! వాగీశ్వరీ! వాజ్ఞ్మయీ !
రామా! చిన్మయ రూపిణీ! రసధునీ! రాజ్ఞీ! రమా! రాగిణీ!
శ్రీ వసుధాఖ్యవై, ధరను శ్రీల నొసంగెడు లక్ష్మివై, సదా
భావము లేలు బ్రాహ్మివయి, ప్రాణుల చేతన రూప శక్తివై,
పావన భారతావనిని పల్లె జనమ్ములు మ్రొక్కు గ్రామపుం-
దేవతవై రహింతు గద దీప్తుల చిన్మయ రూపిణీ! శివా!