కాళరాత్రి
************
తేగీ. కాళరాత్రి భయంకరి ఖరతురంగ
కాలకేశిని కౌశికి ఖడ్గహస్త
నీలలోహిత నిర్మల నిర్వికార
ఫాలలోచని మాలిని పాపహారి.
తేగీ. కఠిన చిత్తుల పాలిటి కాళరాత్రి
యెన్న భక్తుల కీ తల్లి వెన్నెల నిశి
దుష్ట శిక్షణ నొనరించి శిష్ట జనులఁ
గాచుఁ జల్లగా నీ శుభంకరి సతమ్ము.
కం. నవరాత్రులలో నిష్ఠను
ప్రవిమల హృదిఁ గాళరాత్రి పరిచర్యల నే
డవ నాఁడు గడుపు వారికి
లవలేశము సంకటములు రావు ధరిత్రిన్.

No comments:
Post a Comment