padyam-hrudyam

kavitvam

Thursday, February 27, 2014

యీ శివరాత్రి నైన నిను నింపుగ గొల్చెడి భాగ్య మీయవే.............



మాతను గూడి వేడుకను మంచు గిరిన్ కొలువుండి, చెంతనే
ప్రీతిగ నాడు పుత్రులను ప్రేమను ముద్దిడు చుండి, భక్తితో
జోతలు సేయు దేవతల జూచుచు నుండి కృపల్ దలిర్ప, యీ
రాతిరి విందు సేతువట రమ్యముగా కనుదోయికిన్ శివా!

శంకర శంకరా యనుచు సన్నుతి జేతును, నీకు పాపపుం-
బంకిల మంటె నంచు మది భావన సేయక, సంకటమ్ము లే
వంకలు బెట్టబోక, నెలవంకను దాల్చిన దొడ్డ దేవరా!
పంకజనాభ వందిత !శివా! పరమాత్మ! పురారి! బాపరా.

మూడవ కంట జూచెదను మూడును నీకని పల్క భావ్యమే?
చూడు మదాపహారి! పరిశోధన జేసిన నన్ను గాంచవే
యాడెడి శత్రు షట్కమును హాయిగ నాయెద ప్రాంగణమ్ములో!
చూడుము వాని నొక్కపరి, జోతలు! చిచ్చర కంట నీశ్వరా!

కాతువు భక్త కోటులను కంటికి రెప్పగ నందురే నినున్
జూతు వదేమి చోద్య మొకొ ? సుందర దృశ్యమొ ? కాక క్రీడయో ?
భీతిని గొల్పు నా ప్రబల భీకర దుష్కర పాప రాశులన్
పాతర వేయవే తుహిన పర్వత పంక్తుల  యందు శంకరా!

శైశవమా గతించినది, చల్లగా జారెను యౌవనమ్ము, నా
యాశకు లేక హద్దు తిరుగాడితి విత్తము వెంట వెర్రినై!
లేశము గూడ దల్పకనె రేబవలుల్ బ్రతుకంత నీడ్చితిన్,
యీ శివరాత్రి నైన నిను నింపుగ గొల్చెడి భాగ్య మీయవే.

Friday, February 14, 2014

సమ్మక్కయు,,,,,,సార్లక్కయు..........



లెక్కకు మిక్కిలై జనులు రేబవలుల్ తిరునాళ్ళ గొల్వ స-
మ్మక్క ! కృపామయీ! నతులు మాత యటంచును, భక్తి మీర సా-
ర్లక్క ! దయాంబు రాశి ! మము రక్షణ సేయరె యంచు, నేలరే
మక్కువ తల్లులై సతము, మాలిమి బిడ్డల నేలు రీతిగా.

గ్రక్కున నేల భక్తులను గద్దెను కొల్వయి చిల్క గుట్ట సా-
ర్లక్కకు తల్లియై యిల వరంగలు మేడర మందు వెల్గు స-
మ్మక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్
మక్కువ జిల్కు దృక్కులను మాలిమి వేరొక దైవ మెన్నగన్.



Thursday, February 6, 2014

రథసప్తమి...........



హరిత హయముల బూన్చిన యరద మెక్కి 
తిమిర తతులను పోద్రోలు దీక్ష బూని 
కడలి తరగల పైపైకి కదలుచున్న
వేయి చేతుల రేనికి వేయి నతులు.

హరి దశ్వంబులు లాగు స్యందనము ఫై నాకాశ మార్గంబునన్ 
పరుగెత్తంగను లేచె భాను డదిగో ప్రాభాత కాలమ్మికన్ 
సరి మందేహుల స్వామి గెల్చుటకునై సంధ్యార్ఘ్య మీయంగ నో 
నరులారా చనుదెంచరే రయము సంజ్ఞానాథు నర్చించరే.


Tuesday, February 4, 2014

శారదా..............







శారద! నీ పదాంబురుహ సన్నిధి నౌదల జేర్చి మ్రొక్కెదన్
భూరి కటాక్ష వీక్షణల పొందికతో గనుమమ్మ! నా మదిన్
జేరి చరించుచున్ సతము శ్రీకర భావ తరంగ రాజితో
సార వచోవిభూతు లిడి సాకుము నన్ శుభదా! సరస్వతీ!