padyam-hrudyam

kavitvam

Tuesday, May 21, 2013

సరసాహ్లాదిని - సమస్య


సమస్య:

భూతప్రేతపిశాచసంఘమును సంపూజించినన్ మేలగున్.

నా పూరణ:
 
చేతన్ శూలము, బూది మేన, తలపై చెన్నొందు నెల్వంకయున్,
భీతిన్ గొల్పెడు సర్పరాజ తతులున్, బెంబేలు పుట్టించు పల్
భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్
ప్రీతిన్ సాంబసదాశివున్ విరతులై బిల్వంబులన్ నిత్యమున్.

Wednesday, May 15, 2013

శంకర జయంతి.

 





శాంభవి యొడిలోన సౌన్దర్యలహరియై
...........పవళించి యాడిన ద్రవిడ శిశువు!
ఆనందహేల శివానందలహరీ త-
...........రంగభంగపు టబ్బురంపు దరువు!
మూఢమతుల ఘన మోహ ముద్గరముచే
...........దారికి దెచ్చిన దండి గురువు!
కరుణ చిప్పిల్లగా కనకధారై పేద
...........కాంతకు దొరికిన కల్ప తరువు!

కాలడి గ్రామ దేవత కన్న బిడ్డ!
అరయ నద్వైత దీప్తుల కాటపట్టు!
భక్తి వేదాంత పటిమకు పట్టుగొమ్మ!
శంకరుల కంజలి ఘటింతు సంస్మరింతు!


Wednesday, May 8, 2013

సరసాహ్లాదిని - దత్తపది

కంది - పెసర - సెనగ - మినుము
పై పదాలను ఉపయోగిస్తూ  నచ్చిన ఛందస్సులో
పార్వతీకళ్యాణము గురించి పద్యం వ్రాయాలి.


నా పద్యం:
 
సిగ్గుతో కందిన చెలి బుగ్గలను జూచి
...................చిరునవ్వు చిందించె శివుని మోము!
ఈశుని నవ్వులింపెసరగ తనపైన
..................తిలకించి పులకించె లలన గిరిజ!
సన్నముత్తియపు సేసల దీసె నగజాత
..................తలవంచె శంభుడు నెలత ముందు!
మినుముట్టె మంగళ ధ్వనులు తాళిని గట్ట
.................సర్వ మంగళ మెడన్ శర్వు డపుడు!

తల్లిదండ్రుల పెళ్లి సంతతి ఘటించి
తనువులెల్లను కన్నులై తరచి చూచె!
శుభ శకునములు పొడసూపె సురుల కంత!
తారకుని రాతి గుండెలో దడ జనించె!