రావణాదుల భవనములలో హనుమంతుఁడు సీతకై వెదకుట
=============================================
తే.గీ.
కామరూపియై మారుతి భూమిజ కయి
భవనముల లోన వెదకుచు వడిగఁ జనుచు
నరుణ భాస్కర వర్ణమౌ వరణము గల
పంక్తికంఠుని సౌధమ్ము వైపు కదలె. 6- 1
సీ.
కలధౌత మయములున్ గనకంపుఁ బూతల
.......ప్రభల నీనెడి బహిర్ద్వారములును
దంత రజత వర్ణ తాపడ యుతములు
.......వింతధ్వనులఁ జేయు పెక్కు తేరు
లుత్తమ కాంతల పుత్తడి భూషలు
.........గుణుకుణు మని చేయు గొప్ప సడులు
భేరీ మృదంగాది భీకర ధ్వనులును
.........హోమాగ్ని సంజాత ధూమములును
తే.గీ.
జలధి గాంభీర్యయుక్తమౌ శబ్ద మలర
గజ తురంగ రథాదుల గణము లెసగ
లంక కాభరణమ్ముగ రహి వహించు
రావణుని కోటఁ గాలించెఁ బావని వెస. 6- 2
తే.గీ.
రావణుని కోట దరి నున్న రాక్షసాళి
యిండ్లఁ దోటల విడువక నింత యైన
భయముఁ జెందక మారుతి రయముగాను
వెదుకఁ జొచ్చెను సీతకై వెంట వెంట. 6- 3
కం.
దశరథ రాముని సతికై
విశదముగా రక్కసుల నివేశము లెల్లన్
నిశితేక్షణములఁ గని పర
వశుఁడై యా సంపదలకుఁ బావని యొప్పెన్. 6- 4
ఆ.వె.
ఇట్లు సకల గృహము లెల్లను శోధించి
శక్తి ముద్గరాది శస్త్రములను
నిలిచి యచట వికృత నేత్రలై రావణుఁ
గాచు చున్న స్త్రీలఁ గాంచె నతఁడు. 6- 5
తే.గీ.
రావణుని మందిరము వద్ద కావలిగను
*గుల్మముల, శస్త్రధారులౌ గొప్ప దైత్య
తతులఁ, బలు వర్ణముల హర్యతములఁ, గరుల
ద్వారముల చెంత దర్శించె వానరుండు. 6- 6
*సేనావిశేషము
తే.గీ.
వివిధ రూపాల నలరించు ప్రేంఖణముల,
లతలతో నొప్పు పొదరిండ్ల, రమ్య చిత్ర
సదనముల, నాడు గృహముల, సతులఁ గూడి
యొంటి రావణుఁ డేలెడి యింటిఁ గనియె. 6- 7
కం.
మందర పర్వత సమమై
సుందరమౌ వనమయూర శోభాయుతమై
యందమగు ధ్వజములను గను
విందగు నా భవన ప్రభల వేడ్కను గనియెన్. 6- 8
ఆ.వె.
సకల నిధి రత్న సంచయ సంయుతమ్ము
రావణామోఘవిక్రమ లభ్య యశము
శివ సుకైలాస సన్నిభ శ్రీకరమ్ము
నసుర విభు సౌధ సౌందర్య మరసె నతఁడు. 6- 9
No comments:
Post a Comment