padyam-hrudyam

kavitvam

Saturday, January 16, 2021

సుందరవిజయం 4


(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - నాలుగవ సర్గ)

*హనుమంతుడు ప్రాకారము దాటి లంకలో ప్రవేశించుట*
ఆ.వె.
లంక నట్లు గెలిచి లాంగూల వీరుఁడా
రాత్రి ప్రహరి నెక్కి శత్రు శిరము
పైనఁ బోలె సవ్య పాదమ్ము మోపి నాఁ
డమర పురిని మించు నసుర పురిని. 4- 1
తే.గీ.
అట్టహాస రవమ్ముల నదిరి పడుచు
వాద్యఘోషకు గుండెలు పగులు నట్లు
పిడుగు లుమిసెడి మబ్బుల వెరవు పెద్ద
మేడ లరయుచు సాగె సామీరి యపుడు. 4- 2
సీ.
అప్సరసల మించు నంగనా మణులవౌ
........మంద్ర మధు స్వర మార్దవములు
ముదితల యొడ్డాణముల, కాలి యందెల
........మువ్వల మురిపించు సవ్వడులును
నొక యింటఁ జప్పట్లు నొక చోట సింహనా
........దములు వేరొక తావు దాళములును
వేదనాదమ్ములు వివిధ జపమ్ములు
........రావణ స్తోత్రముల్ రావములును
తే.గీ.
రాక్షసుల యిండ్ల నా రాత్రి రాజసముగఁ
దిరుగుచును వినెఁ బావని యరయఁ గుజను
రాజమార్గానఁ జూచెను రక్షకులను
నగరి మధ్యనఁ గనె రావణాను చరుల. 4- 3
సీ.
వ్రతదీక్షలో నుండి క్రతువుఁ జేసెడి వారి,
.........నెద్దు చర్మము దాల్చి యెగురు వారి,
నున్నగుండుల వారి, మిన్న జడల వారి,
.........గరముల దర్భలు గలుగు వారి,
నరులు నశింపగా నభిచార హోమాల
.........నిర్వహించుచు నుండి నెగడు వారి,
ముద్గరాల్ దండముల్ మున్నగు శస్త్రాల
.........ధరియించి క్రుద్ధులై తిరుగు వారి,
నేకాక్షులగు వారి, నేక కర్ణము వారి,
........నుదరమ్ము కుచములు నుబ్బు వారి,
ముడుతలు వడియున్న మొగములు గల వారి
........వివిధాయుధమ్ముల వెలయు వారిఁ
బొడవు లావును గాక పొట్టి సన్నము గాక
........నెరుపుఁ దెల్పును గాక మెరయు వారి,
తే.గీ.
గూను లేనట్టి, మరుగుజ్జు గాని వారి,
రూపసులను, గురూపులఁ, దాపినట్టి
కవచధారుల, ధ్వజములు గలుగు వారిఁ
గాంచె మారుతి లంకలోఁ గనులు సెదర. 4- 4
తే.గీ.
పూలమాలలు ధరియించి పొంగు వారి,
మేన చందన మలదుక మించు వారి,
వివిధ వేషాలు ధరియించి స్వేచ్ఛ మీర
వజ్రములు శూలములు దాల్చి వరలు వారిఁ
(గాంచె మారుతి లంకలోఁ గనులు జెదర.) 4- 5
తే..గీ.
కొండ శిఖరముపై స్వర్ణ మండితమగు
ద్వార తోరణాల్, పద్మాలు పరిఖ, లొప్ప
పెద్ద ప్రాకారముల తోడ వెల్గుచున్న
రాక్షసేంద్రుని భవనమున్ రమ్యముగను,
(గాంచె మారుతి లంకలోఁ గనులు జెదర.) 4- 6
తే.గీ.
నగల చప్పుళ్ళ, దివ్యమౌ నాదములను,
ఘోట హేషల, రథ వాజి కుంజరముల,
బండ్ల, వ్యోమయానమ్ముల, వారిదముల
వంటి నాలుగు దంతాల భద్రములను,
(గాంచె మారుతి లంకలోఁ గనులు జెదర.) 4- 7
తే.గీ.
పశుల పక్షుల బొమ్మలు భాసిలంగ
తగిన సొగసుల నొప్పెడు ద్వారములను
నగణితమ్మగు నసురు లహర్నిశలును
గాపుఁ గాయు రాజభవంతిఁ గాంచె నతఁడు . 4- 8
తే.గీ.
స్వర్గమే యన నొప్పెడి స్వర్ణ లంక
నరయుచును సాగె ముందుకు నాంజనేయుఁ
డమిత హర్షమ్ము నొందుచు నందమునకు
ధరణిజను జూచు తలపునఁ ద్వరితముగను. 4- 9
కం.
అంగుగ ముత్యాల మణుల
బంగరు ప్రహరీలు దాటి పావని చేరెన్
రంగుగ ధూపపు టగరుల
హంగుగ విలసిల్లు రావణాంతఃపురమున్. 4-10

No comments: