(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - రెండవ సర్గ )
*హనుమంతుడు లంకను చూచుట*
మకో. అమ్మహా బలుఁడైన మారుతి యా భయంకరమైన సం-
ద్రమ్ము దాటి యొకింతఁ దేరి ముదమ్ము నొందె త్రికూట శై-
లమ్ము పై నలరారు బంగరు లంక వంకను జూచుచున్
గుమ్ముగా వృక్షములు రాల్చిన గుట్టలౌ కుసుమమ్ములన్. 2- 1
కం. ఇంకను వందల కొలదిగ
నుంకించెద యోజనముల నుప్ఫని యిట్టే
జంకక, నూరామడలా
టంకము లేకుండ దాటుటలు సిత్ర మొకో? 2- 2
కం. అని తలచి యాన్జనేయుఁడు
చనె ముందుకుఁ బచ్చనైన చక్కని బయళుల్
గనువిందుఁ జేయగా రా-
వణ పాలిత మైన లంక వంకకు వడిగా. 2- 3
కం. ఫల పుష్పభరితమై పలు
పులుగుల కావాసమైన భూరుహ పంక్తుల్
గలువలు పద్మము లంచలు
గల వనములను గొలనులను గపి దిలకించెన్. 2- 4
సీ. పద్మకైరవముల భాసించు పరిఖలు
.........ధనువులఁ దాల్చిన దానవులును
బంగరు ప్రహరీల శరదభ్ర సమములై
.........యంబర మంటెడు హర్మ్యములును
విస్తృతమై యొప్పు వీధులు నమితమౌ
.........బురుజుల జెండాలఁ బురతతులును
లతలతో భాసించు రమ్యమౌ కాంచన
.........ద్వారమ్ము లొప్పెడి భవనములును
తేగీ. విశ్వకర్మ నిర్మితమైన వేల్పునగరిఁ
బోలు లంకను రావణ పాలితమును
నింగిలోఁ దేలుచున్నట్లు నిలుపబడిన
కోట నా లంకఁ గనెఁ గపికుంజరుండు. 2- 5
శా. ఆ లంకన్ గనగా నచింత్యమును భవ్యం బిమ్మునౌ పూర్వమే
పాలింపం బడె నా కుబేరపతిచే భాగ్యాల మంజూషగా
కైలాసాచల శృంగ మేమొ యన నాకాశమ్ము స్పర్శించు పా
తాలాంతర్గత భోగవ త్యస మహా స్థానీయమై తోచెడిన్. 2- 6
తేగీ. శత్రు దుర్భేద్యమైన దీ స్వర్ణ లంక
వానరానీక మీ పురిఁ జేరు టెట్లు
చేరి దనుజ సంఘములతోఁ బోరు టెట్లు
భూమిజను రాఘవుండింక పొందు టెట్లు . 2- 7
కం. అని తలచి మారుతాత్మజుఁ
డనుకొనె తనలోన మరల నది నాకేలా
కనుఁగొనెద మొదట రావణు
ఘన పటిమను సీత కొఱకుఁగాలింతు వెసన్. 2- 8
కం. నేనీ రూపముతో బల
వానులు గ్రూరులును దనుజ వైరుల దాటం
గా నేరను లంకను జిన
మేనునఁ జొరబడుట మేలు మెల్లగ రాత్రిన్. 2- 9
తేగీ. దుష్టుఁడౌ రావణుని గనుదోయిఁ బడక
ప్రభువు కార్యంబు నావల్ల పాడు గాక
యే యుపాయమ్ముతో లోన కేగ గలుగు
దెట్టు లాసీత జాడ నేఁ బట్ట గలను. 2- 10
కం. పరిపరి విధముల నీ గతి
ధరణిజకై వెదకు తీరుఁ దనలోఁ దానే
యరయుచు వాయు తనూజుఁ డె
దురు చూచెను రాత్రి కొఱకు తొందర వడకన్. 2- 11
తేగీ. ప్రొద్దు గ్రుంకినఁ దోడనే బుద్ధిశాలి
దేహ మెల్లఁ గుదించెను దీరు మారి
మూషకారాతి యంత యమోఘమైన
రూపుఁడై కొండ దిగి లంక ద్రోవఁ బట్టె. 2- 12
కం. బంగారు స్తంభములతో
హంగగు కిటికీలు పెక్కు లంతస్తులతో
రంగగు మేడలు గల లం
కం గన హర్షమున వెడలె కపివరుఁ డంతన్. 2- 13
ఉ. రావణ బాహు పాలితము రక్షితమై కనుపించు చున్నదీ
భూవలయమ్మునం గనక భూషితమై యలరారు లంక నే
నేవిధి కార్యమున్ గరపు టీ దనుజారుల కండ్లఁ గప్పి యం
చా విభవంబుఁ గాంచుచు మహా వ్యథఁజెందె కపీశుఁడంతలో. 2- 14
చం. హనుమకుఁ దానుఁ గూడను సహాయము సేయగ వచ్చినాఁడు ధా
త్రినిఁ దన వెండి వెన్నెలలఁ దెల్లగఁ జేయ సుధాంశుఁ డత్తరిన్
గన బెనుగుల్ల, పాలు, సితకంజము వోలెను శ్వేతపుంజమై
కనులకుఁ బంట యౌచు నుడుకాంతుఁడు రాతిరి వేళ నింగిలో. 2- 15
No comments:
Post a Comment