(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - మొదటి సర్గ)
మ.కో.
జాంబవంతుఁడు ప్రోత్సహించగ శత్రు నాశకుఁడైన తా
నంబరమ్మున నేగ నెంచెను యాతుధానుఁడు లంకలో
నంబ నుంచిన చోటుఁ గన్గొన నాత్రమై హనుమంతుఁడున్
సంబరమ్మున గ్రీవమెత్తె వృషమ్ము పోలిక నొప్పుచున్. 1
తే.గీ.
"సాగరోల్లంఘనముఁ జేతు క్షణము లోన
సీత జాడను గనుగొందుఁ జింత వలదు"
పలికె సామీరి యాత్మ విశ్వాస మొలుకఁ
గపికులమునకు శాశ్వత ఖ్యాతి నొసగ. 2
తే.గీ.
అంజలించెను భక్తితో హనుమ యపుడు
భానునకు మహేంద్రునకును బవనునకును
స్వర్భువునకును భూతపంచకమునకును
దక్షిణ దిశకు నేగెడి తలపుఁ బూని. 3
ఉ.
పెంచెను కాయమున్ హనుమ పెల్లుగ శక్తినిఁ బూని కాలు దా
నుంచి మహేంద్ర కుధ్రమున హుమ్మని గెంతెను దాని యొత్తిడిన్
గొంచెము గ్రుంగె బర్వతము గొబ్బున వృక్ష సుమాలు రాలెఁ బీ
డించబడంగ శైలములు ఢీకొని యగ్ని జెలంగె నంతటన్. 4
తే.గీ.
హనుమ పాదపు టొత్తిడి కదిరిపోయి
కొండ గుహలలో జంతువుల్ గోల సేసె
సర్పముల నోళ్ళలో విష జ్వాల లెగసె
నోషధులు గూడ నా విష మ్మోప వాయె. 5
సీ.
కొండగుహల లోనఁ గొలువౌ తపస్వులు
...భూత దుశ్చర్యగాఁ బొరపడంగ
విహరింప వచ్చిన విద్యాధర శ్రేణి
...భయపడి స్త్రీలతోఁ బయికి నెగుర
నణిమాది సిద్ధుల నాకాశమున నిల్చి
...విద్యాధరర్షులు వేడ్కఁ జూడ
దుస్తర జలధినిఁ ద్రుటిలోన లంఘించు
...నీద కొమరుఁడని ఋషులు వలుక
తే.గీ.
రోమములను విదల్చెను రూపుఁ గదపె
గర్జనముఁ జేసెఁ గొప్ప మేఘమ్ము వోలె
వినతసూనుఁడు పామును విసరినట్లు
వాయుసూనుఁడు విసరెను వాల మపుడు. 6
చం.
గుదియల వంటి బాహువుల గొబ్బునఁ జాచెను, కౌను కాళ్ళు తా
నదనుగ వంచె, స్కందముల, నాపయి కంధరమున్ బిగించెఁ దా
హృదయమునందుఁ బ్రాణముల నిమ్ముగ స్తంభనఁ జేసెఁ జూచుచున్
గుదురుగఁ బోవు దారిఁ గపికుంజరుఁ డాకసవీధి నయ్యెడన్. 7
ఆ.వె.
శిఖరిఁ ద్రొక్కి పెట్టి చెవులను గుంచించి
పైకి నెగురు వేళఁ బలికె నతఁడు
రామబాణ మెట్లు రయమునఁ బోవునో
యేను నట్లె లంక కేగు వాఁడ. 8
ఆ.వె.
లంకలోన సీత లభియింప కున్నచో
నమరపురికిఁ జనెద నచటఁ గూడ
కాన రాని దైనఁ గట్టి యా రావణు
రామపాదములను రాలవైతు. 9
తే.గీ.
ఎట్టులైనను కార్యమున్ బట్టుదలను
బూర్తిఁజేతును, దర్శింతు భూమిసుతను,
గానిచో రావణాయుతమైన లంకఁ
ద్రవ్వి తెత్తు నా రామపాదముల వైతు. 10
తే.గీ.
జలధి పైన ప్రయాణమన్ దలఁపు లేదు
లంక బహు దూరమనియెడు శంక లేదు
వైనతేయుఁడ ననుకొని వాయుసుతుఁడు
నింగి కెగిరెను క్షణములో నేరుగాను. 11
* హనుమంతుని సముద్రయానము *
సీ.
కొండపై వృక్షముల్ కొమ్మలతోఁ బాటు
.........వెనువెంట నెగుర నా వేగమునకుఁ
బయనమై పోయెడు బంధుజనమ్ముల
........సాగనంపెడు వారి చంద మాయె!
మరికొన్ని చెట్లు సమరములో రాజు వెం-
........బడిపోవు సైన్యమన్ భ్రాంతిఁ జేసె !
వెనుకకు మరలిన ప్రియమిత్రులో యనఁ
.......బూల రాల్చుచు నీట కూలిపోయె!
శక్రుని భీతిచే జలధిలో మున్గిన
......కొండల వలెఁ దోచె కొన్ని చెట్లు
తే.గీ.
పూలు మొగ్గలు చివురులు రాల మీద
మిణుగురుల్ గప్పు కొండయై మెరయ హనుమ
గాలి కెగిరిన పూవులు రాలి యుదధి
రిక్కలన్ మించు గగనమన్ రీతిఁ దోచె. 12
తే.గీ.
రంగురంగుల పూవులు రమ్యముగను
వాయుసూనుని దేహానఁ జేయ విడిది
మెరపులను గూడు నల్లని మేఘము వలె
దోచినాఁ డాతఁ డయ్యెడ దూరమునకు. 13
సీ.
చాచిన బాహువుల్ శైల నిర్గతములౌ
...పంచ శీర్షముల సర్పాల రీతి
రెండు నేత్రమ్ములు కొండలలో రాజు
...కణకణ మను నగ్ని కణము లట్లు
నెరుపైన నాసిక నెఱ్ఱనౌ వదనమ్ము
...వేకువలో రవిబింబ మనగ
గాలిలో లేచిన ఘనమైన వాలమ్ము
...సాగి వంపుగ నింద్రచాపమొ యన
తే.గీ.
తెల్లనౌ దంతములఁ గపి దేలి యున్న
వాలమున మధ్య గుడిలోఁ బ్రభాకరునిగ
వాలమూలమ్ము పగిలిన పర్వతంపు
ధాతుశిల భాతి నరుణమై ప్రీతిఁ గొలిపె. 14
సీ.
మూసి తెఱచు బాహు మూలాలఁ బుట్టిన
...గాలి శబ్దము మేఘ గర్జ నాయె
నుత్తరమ్మునఁ బుట్టి యుదుటున దక్షిణ
...దిక్కు కేగెడు తోకచుక్క యాయె
బంధింప గొలుసులఁ బదపడి ముందున
...కురుకు మదించిన కరటి యాయె
నీటిలోఁ దోచెడి నీడను జూడగా
...నుదధిలో సాగెడి యోడ యాయె
తే.గీ.
నాతఁ డెచ్చోట నెగిరిన నా జలమ్ము
బిచ్చి వట్టిన తీరాయె వేగమునకుఁ
గొండ యెత్తైన కెరటాలఁ గొట్ట సాగె
ఱొమ్ముతోఁ గపియోధుండు హుమ్మనుచును. 15
ఉ.
ఆగక వాయువేగమున నంబర వీథిని వాతసూతి తా
నేగఁగ, ధాటికిన్ జలము నేగెను నింగికి మేఘపంక్తి గా
మూగుచుఁ గ్రింద గోతిని సముద్రపు జీవులు నగ్న దేహపుం
భాగము లట్లు బైకి కను పట్టిన వత్తరి నెంత వింతయో. 16
కం.
వెడలుపు పది యామడలును
బొడవుం గన ముప్పదియును మున్నీటను వెం
బడి వచ్చెడి హనుమంతుని
పొడ తెల్లని మబ్బు వోలెఁ బోవగ వడిగా.... 17
ఆ.వె.
పక్షి వోలెఁ జను, బ్రభంజనమో యనఁ
బెద్ద మబ్బు గుంపు వెంబడించు,
నట్టి నీరదమ్ము లద్భుత కాంతులఁ
జిత్రమైన రీతిఁ జెలగుచుండ. 18
కం.
మబ్బులలో దాగుండును
గబ్బున వెలుపలికి వచ్చి కనుపించు నతం
డబ్బుర పరచుచుఁ జంద్రుఁడు
మబ్బుల మాటున రహించు మాడ్కిని వెల్గున్. 19
తే.గీ.
రామదూతను గని సురల్ ప్రేమ మీరఁ
బూల వానలు గురిపింపఁ బూషుఁ డతని
నెండతోఁ దపియింపక యింపుఁ గొల్పె
వాయు వనుకూలముగ వీచె హాయిగాను. 20
* మైనాకుని ఆతిథ్యము *
మ.
కని సామీరిని సాగరుండు మది పొంగన్ గౌరవం బంతటన్
దన యిక్ష్వాకు కులంపు బంధమును స్వాంతంబందు భావించి లో
నను దాగున్న హిరణ్యనాభు నడిగెన్ నాకీవు దోడ్పాటుగాఁ
జని నీట న్నిలు పైకిఁ దేలి కపి విశ్రాంతిం గొన న్నీ పయిన్. 21
కం.
అన మైనాకుఁడు రయముగఁ
జని ఫలపుష్పావృతంపు క్ష్మాజ భరితమౌ
కనకాచలమై సంద్ర
మ్మును జీల్చుక పైకి లేచెఁ బొడవౌ కొనలన్. 22
కం.
నల్లని మబ్బులఁ జించుక
తెల్లగ వెలుపలికి వచ్చు తిమిరారి వలెన్
బెల్లగు శోభల తోడ గు-
భిల్లున పైఁ బడిన దానిఁ బింగళుడు గనెన్. 23
కం.
"బంగారు శృంగములతో
హంగుగఁ బైకుబికి దారి కడ్డము నిలచెన్
భంగముఁ జేయగ నా పనిఁ
బొంగుచు రాక్షసుఁ" డని కపి బుద్ధినిఁ దలచెన్. 24
తే.గీ.
గాలి మబ్బును దాకిన గతినిఁ దాకె
ఱొమ్ము జేతను గిరిని మారుతి క్షణానఁ
బడెను మైనాకుఁ డా దెబ్బ పడిన యంత
లేచి పావని వేగముం జూచి మురిసె. 25
ఉ.
'సాగరుఁ డంపినాఁడు కపిచంద్రమ! కొంచెము విశ్రమింపగా
నాగుము, దీరు నీ శ్రమము, హాయిగఁ బండ్లనుఁ గందదుంపల
న్నాగృహమందుఁ జేకొనుము, నాదగు విన్నప మాలకించు ని
న్నీ గతి సత్కరించుట లదే పదివే' లనె శైలరాజమున్. 26
తే.గీ.
సంతస మ్మాయె మర్యాద చాలు నాకు
నడ్డు వని యెంచి కొట్టితి నలుగఁ బోకు
కాల హరణమ్ము తగ దిట వీలు కాదు
మధ్యలో నాగ రాదని మారుతి యనె. 27
ఆ.వె.
చేతితో స్పృశించి ప్రీతితో మైనాకు
నెగిరె నింగి వైపు ఋషులు మెచ్చ
హనుమ జేసినట్టి యా ద్వితీయాద్భుత
కార్య మెంచి సురలు గణుతి సేయ. 28
* సురసను జయించడం *
చం.
సురలును సిద్ధులున్ ఋషులు జూచి కపీశుఁ బరీక్ష సేయగా
సురసను బిల్చి యో రమణి చుక్కలతెర్వున నేగుచున్న వాఁ
డరయుము వాని ద్రోవను భయంకర రాక్షసివై విఘాతమున్
బరపుము చూతుమన్నఁ జనెఁ బాములతల్లి తదర్థమై వెసన్. 29
ఆ.వె.
వికృత రూపమునను భీతిల్ల నెల్లరు
సురస యసురనారి సరణి మారి
జలధి మధ్యమునకుఁ జని హనుమంతుని
నడ్డగించి పలికె నాగు మనుచు. 30
ఆ.వె.
సురలు నిన్ను నాకు సురుచిరాశనముగా
నిర్ణయించినారు నేరుగాను
రమ్ము నోటిలోని కిమ్ముగా భక్షింతు
నన్న భీతి లేక హనుమ పలికె. 31
కం.
అమ్మా! దశరథ రాముఁడు
తమ్ముని నర్థాంగిఁ గూడి తండ్రి పనుపునన్
ద్రిమ్మరుచుండెను వనముల
నిమ్ముగ ఋషి పుంగవులకు నిరవై ధరలో. 32
ఆ.వె.
తాపసారులైన దానవ తతులతో
వైర మగుట దొంగ వలెను వచ్చి
సీత నపహరించె చెనటి యా రావణుఁ
డతని లంక కిప్పు డరుఁగు చుంటి. 33
తే.గీ.
సహకరింపుము నా కీవు సహనమునను
వీలు కాదందువా నేను వేగఁ బోయి
సీత నరసి శ్రీరామునిఁ బ్రీతుఁ జేసి
తిరిగి వచ్చెద భక్షింపఁ దృప్తి గాను. 34
తే.గీ.
సురస కాదని పెద్దగాఁ దెరచె నోరు
బొటన వ్రేలంత రూపున బుద్ధిబలుఁడు
మారుతాత్మజుఁ డా నోట దూరి క్షణము
వెలికి నేతెంచి నింగిలో నిలిచె నపుడు. 35
కం.
మ్రింగగ రాహువు చంద్రుని
గ్రుంగక వెలి కేగు దెంచి క్రొత్త వెలుగులన్
నింగిని క్రాలెడు గతిఁ గపి
పొంగుచు సురసాంగనకును మ్రొక్కుచుఁ బలికెన్. 36
తే.గీ.
నతులు దాక్షాయణీ! నీకు నాకు లిడిన
వరము నిజమాయె నీనోటఁ జొరఁబడితిని
తిరిగి వెలికి నేతెంచితి నరుగువాఁడ
సీత జాడను గనుగొన మాత! సెలవు. 37
తే.గీ.
రాహు ముఖ నిర్గతంబైన రాజు వోలె
నున్న హనుమను జూచి యా యురగ మాత
స్వస్వరూపమ్ముఁ దాలిచి, సాగుమయ్య
కలుప జానకీరాములఁ గపివర! యనె. 38
తే.గీ.
హనుమ చేసిన మూడవ యద్భుతమును
మేలు మేలని యందరు మెచ్చు కొనగ
గరుడ రయమున నుదధిపై కపివరుండు
వాయు మార్గాన నెగురుచుఁ బయన మాయె. 39
* సింహికను సంహరించడం *
కం.
రెక్కలు ముడిచిన గిరి వలె
మిక్కుటమౌ వేగమునను మింటను కనగా
నక్కజముగఁ బయనించెడు
నక్కపి గనె సింహికాఖ్య యంబుధి లోనన్. 40
కం.
పీడించు చుండె నాకలి
నేడీ కపి దొఱకె నాకు నింగిని రాను
న్నాడిటు భక్షించెద నని
నీడను బట్టుకొని లాగె నెమ్మది నతనిన్. 41
ఉ.
అంతట వానరేశ్వరుఁడు హా యని యచ్చెరు వొంది యేమి యీ
వింత మహా సముద్రమున వీచెడు గాలికిఁ జిక్కు నావనై
సుంతయు నాడ నీక ననుఁ జూడగ వెన్కకు లాగుచున్న ద
త్యంత మహోగ్ర శక్తి యని యన్ని దిశల్ బరికించి చూడగా. 42
ఉ.
నీటను జూచి పట్టి తన నీడను లాగుచునున్న రక్కసిన్
సూటిగ వానర ప్రభువు సూచన జేసిన జంతు వియ్యదే
మాటని బుద్ధిమంతుఁడగు మారుతి యోచనఁ జేసి లిప్తలో
వాటముగాఁ గళేబరము వార్నిధి నిండగఁ బెంచె నయ్యెడన్. 43
చం.
అది గని సింహికాస్రపయు నాస్య బిలమ్మును జేసెఁ బెద్దగా
నుదధిని మించు వానరుని నుబ్బుచు మ్రింగగ నెంచి యంతలోఁ
బదపడి సూక్ష్మ రూపునిగఁ బావని మారెను జొచ్చె రాక్షసీ
వదనము లోన కేగి బిగఁ బట్టెను రక్కసి మర్మ సంధులన్. 44
ఉ.
చివ్వున దానవాంగనను జీల్చగ నాయువుపట్లు గోళ్ళతో
న వ్వనసంచరుండు వడె నయ్యది దబ్బున నీట నార్చుచున్
గెవ్వునఁ గాలునింటి కరిగెన్ గని మెచ్చగ నింగి భూతముల్
నవ్వుచు రాక్షసాంతకుఁడు నాకపు మార్గముఁ బట్టె నేగఁగన్. 45
* మారుతి లంకలో దిగడం *
ఆ.వె.
ఇట్లు వాయుసూనుఁ డేగి నూరామడల్
చేరి చూచినాఁడు దీరమందు
వృక్ష మండితమ్ము ద్వీపమున్ దోటలన్
సంద్రమునను నదుల సంగమముల. 46
తే.గీ.
భూరి జలదమ్ము వంటి శరీర మరసి
తలచెఁ దనలోనె తాని ట్లనిల సూతి
యిట్టి కాయమ్ము వేగమ్ము నిపుడు సూడ
నిలుపుదురు దృష్టి నా పైనె పొలసుదిండ్లు. 47
కం.
అనుకొని పర్వత సమమౌ
తనువును దగ్గించుకొనియెఁ దత్క్షణమే తా
ననిలసుతుఁడు జ్ఞానులు కా
మనలను దగ్గించుకొనెడు మహనీయ గతిన్. 48
కం.
మూఁ డడుగుల వామనుఁడై
మూఁడు జగములాక్రమించి మూఁడగ బలికి
న్నాఁడు ద్రివిక్రమ రూపము
నూడిచి హరి యొప్పినట్టు లుండెను గపియున్. 49
ఆ.వె.
కామరూపుఁ డైన కపివీరుఁడు గడచి
ఘన తరంగములును గర్కటులును
దానవులును గూడు దారుణ వారాశి
లంబగిరిని వ్రాలి లంక నరసె. 50
...............
No comments:
Post a Comment