ప్రజా పద్య కవితా సదస్సు శోభస్కరంగా జరగాలని కాంక్షిస్తూ..
రాజమహేంద్రవరం విచ్చేసిన కవి మిత్రులకు స్వాగతం పలుకుతూ..
కం.
పద్యమె మనదౌ లోకము
పద్యమె శ్వాసయును ధ్యాస పద్యమె స్వరమౌ
పద్యమె భావము రాగము
పద్యమె సర్వమును మనకు బంధువులారా.
మ.
ప్రజపద్యంపు మనోహరాంగణమునన్ భవ్యాత్ములౌ సత్కవుల్
స్వజయోత్సా హము మించ స్పర్థ మెరయన్ సామాజికాభ్యున్నతిన్
నిజభావమ్ముల నుంచి వ్రాసిరి కదా నిండైన పద్యావళుల్
ప్రజ లోహో యని మెచ్చురీతి విబుధుల్ బాగంచు కీర్తించగన్.
***
సీ.
రాజరాజ నరేంద్ర రాజ్యవైభవ దీప్తి
................నన్నయ ఘంటపు నవ్య మూర్తి
సారంగధరు దీన చారిత్ర ఘటనలు
................చిత్రాంగి రత్నాంగి చిత్ర కథలు
వీరేశలింగము నారీ సమానత
................గోదావరీ నది గొప్ప నడత
శ్రీపాద కృష్ణమూరితి గ్రంధ మాలిక
................చిలకమర్తి యశస్సు శ్రీల చిలుక
తే.గీ.
కోటిలింగాల సన్నిధి గొప్ప వరము
కళల కాణాచి కైతల కమ్మని రుచి
చేరి చెడువాడు లేడను చెడని కీర్తి
ఘనత రాజ మహేంద్రిదే కల్ల గాదు.
చం.
గలగల పారు దివ్య నది గౌతమి యొడ్డున గొప్ప దీక్షతో
మిలమిలలాడు వెన్నెలలు మేలిమి జల్తరు వన్నె లీనగా
జలజల జాలు వార తన చల్లని ఘంటము నుండి వాక్సుధల్
తొలికవి భారతాఖ్యమను తొల్లిటి కావ్యము చేసె నిచ్చటన్..
సీ.
ఆంధ్ర భీష్ముం డను నపురూప కీర్తిని
............నయముగ బడసిన న్యాపతియును!
కవిచక్రవర్తిగా గౌరవింతు మటన్న
............వలదని వదిలిన చిలకమర్తి!
గుండున కెదురుగా గుండె చూపి దొరల
............భంగ పరచినట్టి టంగుటూరి!
ఆంధ్ర పౌరాణికుం డభినవ నన్నయ
............మధునపంతుల వారు! మరియు జూడ
తే.గీ.
నార్ని దామెర్ల వేమూరి న్యాయపతియు
లంక జోస్యుల యిమనేని రాచకొండ
భమిడిపాటియు బుగ్గాది ప్రముఖు లెన్న
రాణ్మహేంద్రికి ప్రియపుత్రు లైరి దెలియ.
ఉ.
రాజులు పండితుల్ కవులు ప్రాజ్ఞ వచస్సుల ప్రాభవమ్ములన్
రాజిల జేసి నారిచట రంగులు శక్రధనుస్సునందు వి
భ్రాజిత రీతి నొప్పు గతి బ్రాకటమై యలరారు ధాత్రిపై
రాజమహేంద్రి! నీ ఘనత రమ్యమగున్ పరికించి చూడగన్.