తే.గీ.
అయ్యె నవరాత్రు లింక నే నరుగు వాఁడ
సంతసించితిఁ బూజలు చాలు ననగ
బాలుఁ డా గణపయ్య పాదాలఁ బట్టి
బావు రని యేడ్చి స్వామితోఁ బలికె నిట్లు
తే.గీ.
పాడు కరొనతో మా యూరు పాడుఁబడియె
నాటపాటలు జదువులు నటుక నెక్కె
మాదు మానాన నీ గతి మమ్ము విడచి
వద్దు గణపయ్య పోబోకు వద్దు స్వామి.
తే.గీ.
కుములు బాలుని గని స్వామి గుండె కరిగి
పలికె నేడ్వకు బాబు నే వత్తు మరల
జనుల పాపాల ఫలితమౌ జబ్బు క్రిమిని
నాన్నతో జెప్పి చేయింతు నాశనమును.
తే.గీ.
బాలకుని దల్లిదండ్రులు బాధ తోడ
సాగ నంపగ వచ్చియు స్వామి నపుడు
తనయు దుఃఖముఁ గని కడు తల్లడిల్లి
స్వామి యభయంపు వాక్కుల స్వస్థు లైరి.
No comments:
Post a Comment