padyam-hrudyam

kavitvam

Sunday, July 5, 2020

ఆది శంకరుల గుర్వష్టకం




ఆదిశంకరుల గుర్వష్టకమునకు అనుసృజనా యత్నము:

ఆ.వె.

మంచి రూప ముండి మంచి భార్యనుఁ బొంది
గొప్ప కీర్తిఁ గలిగి కోట్లఁ బెంచి
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

మగువ సుతులు ధనము మనుమలు సర్వము
నిల్లుఁ బంధువులును నెన్ని యున్న
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

సాంగ వేద విద్య శాస్త్ర కవిత్వాది
పద్య గద్య వశ్య వాగ్మి వైన
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

స్వ పర దేశ గౌరవముల సదాచార
వృత్త మందు నీవు పెద్ద వైన
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

పూజ సేయు గాక రాజులు రారాజు
లైన నీ పదముల నవని లోన
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

దాన వీరుడ వని తనరిన నీ కీర్తి
సర్వ మర్థుల కిడు శక్తి యున్న 
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

యోగ భోగ వాజి యోగ్యములను సతీ
ముఖమున ధన ములను మోహ మున్న
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

వనము నైన స్వగృహమున నైన పని నైన
తనువు నైన మనము తవులు కొనిన
గురు పదాంబుజములఁ గుదరక నీ మది
నేమి ఫలము కల్గు నేమి సుఖము?

పుణ్యజీవి వటువు భూపతి యతి గేస్తు
లెవ్వరైన చదివి యీ స్తవమును
గురువు వాక్యములను గురి యుంచ వాంఛి తా
ర్థము లభించి తుదిఁ బరము లభించు.







No comments: