padyam-hrudyam

kavitvam

Saturday, July 9, 2022

జానకీ వధూటి

 



రామచంద్రోపాఖ్యానము అనే కావ్యం లోని ఒక సుందరమైన పద్యం. కవి పేరు : శ్రీ వారణాసి వేంకటేశ్వర కవి. ద్వితీయాశ్వాసం లోని 131 వ పద్యం.

సందర్భం: సీతారాముల కల్యాణ సమయంలో సీతావధూటిని పెండ్లికూతురును చేసే ఘట్టం.

సీ. అబ్దచంద్రశరాస నాబ్జాబ్దశష్కులీ

..కచముఖభ్రూనేత్ర గండకర్ణ

హీరకందుకబింబ కీరచంపకచంద్ర

..రదచుబుకోష్ఠవా గ్ఘ్రాణహాస

దరబిసపల్లవ ధరతరంగమృగేంద్ర

..గళభుజకరకుచ వళివలగ్న

మహికరతూణక మఠదంతితారకా

..కటిసక్థిజంఘాంఘ్రి గమననఖర


తే.గీ. కాంచన శిరీష కుసుమ సత్కాంతిదేహ

మాంగళిక దివ్య లక్షణ మహిత యగుచు

రఘుకులోద్భవు సామ్రాజ్య రమ యనంగ

జనకసుత యొప్పెఁ బరిణయ సమయ మందు. 

పద్యం క్రమాలంకారంలో శోభిస్తోంది. 1, 3, 5, 7 సీసపాదాల్లో ఉపమానాలను, 2, 4, 6, 8 సీసపాదాల్లో ఉపమేయాలను చెప్పారు కవి.

అన్వయం:

అబ్ద(మేఘం)-కచ, చంద్ర-ముఖ, శరాసన(విల్లు)-భ్రూ, అబ్జ-నేత్ర, అబ్ద(అద్దం)-గండ(చెక్కిలి) శష్కులీ(చక్కిలము)-కర్ణ

హీర(వజ్రం/రవ్వ)-రద(పలువరుస), కందుక-చుబుక, బింబ-ఓష్ఠ, కీర-వాక్, చంపక-ఘ్రాణ, చంద్ర-హాస

దర(శంఖము)-గళ, బిస(తామరతూడు)-భుజ, పల్లవ-కర, ధర(కొండ)-కుచ, 

తరంగ-వళి, మృగేంద్ర-వలగ్న(నడుము)

మహి(భూమి)-కటి, కర(తొండము)-సక్థి, తూణ(అమ్ములపొది)-జంఘ, కమఠ-అంఘ్రి, దంతి-గమన, తారకా-నఖర

కాంచన శిరీష కుసుమ సత్కాంతిదేహ

మాంగళిక(ప్రణవము) దివ్య లక్షణ మహిత యగుచు

రఘుకులోద్భవు సామ్రాజ్య రమ యనంగ

జనకసుత యొప్పెఁ బరిణయ సమయ మందు.

భావం:

పెండ్లి వేళ సీతాకుమారి 

మేఘము వంటి నల్లనైన కబరీ బంధముతోను, చంద్రుని వంటి ముఖమండలము తోను, వింటిని బోలిన కనుబొమలముడి తోను, పద్మముల వంటి కన్నుల తోను, అద్దాలవంటి చెక్కిళ్ళతోను, ౘక్కిలాల వంటి చెవులతోను ప్రకాశిస్తోంది.

ఆమె పలువరుస వజ్రాల్లాగ, చుబుకం చెండులాగ, పెదవులు దొండపండ్లలాగ, వాక్కులు చిలుకపలుకుల్లాగ, నాసిక చంపకపుష్పంలాగ, చిరునవ్వు చంద్రహాసం లాగ వెలిగిపోతున్నాయి. 

జానకీదేవి కంఠం శంఖం వలెను, భుజాలు తామరతూడుల వలెను, చేతులు చివుళ్ళ వలెను,  కుచయుగ్మము  కొండలవలెను, వళులు అలల వలెను, నడుము సింహ మధ్యము వలెను అందగిస్తున్నాయి.

ఆమె కటిభాగం విపులంగాను, తొడలు ఏనుగు తొండాలుగాను, కాలి పిక్కలు అమ్భులపొదులుగాను, పాదాలు తాబేటి చిప్పలుగాను, నడకలు గజగమనాలుగాను, గోళ్ళు తారకలుగాను కాంతు లీనుతున్నాయి,

వైదేహి తనూలత బంగారు దిరిసెన పువ్వు వంటి మంచి కాంతితో భాసిస్తోంది. 

ఓంకారము వంటి గొప్ప దివ్య లక్షణముతో రఘుకులోద్భవుడైన రామచంద్రుని సామ్రాజ్య లక్ష్మియా అన్నట్లుగా జనకసుత యైన సీతామాత శోభ లీనుతోంది.

-శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ సౌజన్యం తో..

No comments: