అదివో అల్లదివో యటంచు తన నేత్రాబ్జంబులన్ గట్టి వై
చి దివారాత్రులు శ్రీనివాసమును సంసేవించుచున్ శ్రీహరిన్
మదిలో బాడుచు వేంకటాధిపుని ప్రేమ న్భక్తిని న్వేదనన్
తుది దాక న్మన అన్నమయ్య చనె నస్తోకంపు గైవల్యమున్.
ఒకచో నార్తిని వేడు వేరొకెడ తా నూగు న్మహోన్మాదియై
ఒకచోటం గని ముద్దు సేయు హరి నోహో బిడ్డడా యంచు నిం
కొకచో నాట్యము సేయు ప్రేమికగ తన్నూహించుక న్భర్తగా
నిక సర్వస్వము నీవ యంచు మిగులు న్నిర్వేదియై యొక్కెడన్.
అచ్చ తెనుంగు భాష కొక అద్దము సూడగ అన్నమయ్య తా
మెచ్చి రచించినట్టి పలు మేల్మిపదాల్ మరి యంతె కాదు సూ
నచ్చిన సంస్కృతంబునను నాణ్యత వొంగులువార నెన్నియో
వచ్చె పదాలు వాక్కునను వాహినులై మన అన్నమయ్యకున్.
పదకవితా పితామహుడు భవ్యపదమ్ముల వేంకటాధిపున్
హృదయపు లోతులందు జనియించిన భక్తిని జేసె సన్నుతిన్
పదముల బట్ట జాలు మన స్వామిని బుట్టుట సున్న మోక్ష స
త్పద మది చేతి కందు నని పాడెను వేడెను బొందె ముక్తినిన్.
No comments:
Post a Comment