సాత్యవతేయునిం దలతు సచ్చరితుం బటుసౌమ్యుఁ గౌరవా
పత్యపుఁ గారణుం శ్రుతివిభాజనుఁ బంచమవేదకర్తనున్
నిత్య విరాగ మూర్తి శుకు నెయ్యపుఁ దండ్రిని బాదరాయణుం
జిత్యభిరక్తు భారత విశిష్ట సనాతన ధర్మకేతువున్.
సారము లేని సంసృతినిఁ జచ్చుచుఁ బుట్టుచు దారి గానకన్
వారును వీరనంచు నలువంకలఁ జూచెద రేలొ వ్యర్థులై
చేరక సద్గురూత్తముని శ్రీపద కంజయుగమ్ము శక్యమే
పారముఁ గానఁబోని భవ వార్థిఁ దరించగ నెట్టి వారికిన్.
గురు వన ధాత్రిపై నడచు కూరిమి దేవుడు జ్ఞానమార్గమున్
గరపు విశిష్ట బోధకుఁడు గానక ధర్మపథమ్ము ఖిన్నతన్
దిరిగెడు వేళ ధైర్యమిడి తిన్నని మార్గముఁ జూపు దివ్వె స
ద్గురు వును సాటి మానవుని కోపు దలంచుట పాతకం బగున్.
No comments:
Post a Comment