padyam-hrudyam

kavitvam

Sunday, January 11, 2015

ఎంకి కనుల పూచె పంకజాలు!



మోపు నెత్త మంచు ముగ్ధ కన్నుల లోని
మెరుపు జూసి మేని విరుపు జూసి
మోపు మాట మరచె మురిసి నాయుడుబావ
ఎంకి కనుల పూచె పంకజాలు.
..............................................................
(మువ్వ శ్రీనివాస్ గారి సౌజన్యంతో......)


Thursday, January 8, 2015

తొలగి పొమ్మన ధర్మమే తెలుపు డయ్య................



ఆది శంకరు లొక్కనా డఖిల శిష్య
గణము వెంటరా జనుచుండ గంగ వైపు
శ్వపచు డొక్కడు నాలుగు శ్వానములను
వెంట గొని యెదు రాయెను వికృత గతిని.
శిష్యు లంతట వానిని చీదరించు
కొనుచు దారిని తొలగంగ కోరినారు
శంకరులు దాని గమనించె, శ్వపచు డనెను
విస్తు పోవగ నది విని వేత్త లపుడు.
బాప లార మీరెవ్వని బాట విడచి
తొలగు మనుచుండ్రి దేహినా? తొలుత నుండి
దేహమున నున్న యాత్మనా తెలుపు డయ్య
వేదవేత్తలు మీరెన్న వివరముగను.
ఎల్ల జీవుల లోనుండు తెల్లముగను
నాత్మ రూపియై పరమాత్మ యనుచు తెలిసి
యంట రాని వాడని నన్న నాదరమున
తొలగి పొమ్మన ధర్మమే తెలుపు డయ్య.
తెలిసి యద్వైత తత్త్వమ్ము తెల్లముగను
వాడు వీడను భావమ్ము వీడ వలదె
యనిన శ్వపచుని పల్కుల వినిన శిష్యు
లకు మదిని క్రమ్ముకొను పొరలంత మాయె.
శుష్కాంతరముల మనమ
స్తిష్కమ్ముల నుండి మాప శివుడే తానా
విష్కర్తగ చనుదెంచెను
నిష్కృతి చూపింప నాల్గు నిగమమ్ములతో.

Saturday, October 25, 2014

కమనీయ మోహ జనిత వైభవమ్ము..............

కటిక చీకటు లెల్ల గడగడ వడకుచు
..........పారిపోవగ జేయు ప్రబల శక్తి
కిటికీల ద్వారాల పటుతరమ్ముగ దూరి
..........మేలు కొల్పులు పాడు మెరుపు తీవ
తటినీ జలమ్ముల తరగల పై స్వర్ణ
..........రోచిస్సు లద్దెటి కూచిక గన
నటియింప ప్రాగ్దిశన్ నగుమోముతో నుషా
..........సుందరి నవ్వుకు స్ఫూర్తిదాత

చూడరే శరత్ప్రాభాత సూర్య కిరణ
పుంజ మంజుల కమనీయ మోహ జనిత
వైభవమ్మును, ధాత్రిని శోభలీను
తీరు ననునిత్యమున్ మీరు దివ్యమగును.

 

Thursday, October 23, 2014

దీప లక్ష్ములు చాలవే..............




కర్ణభేరిని చీల్చు కరకు శబ్దమ్ముల
...........విస్ఫోటనమ్ముల వీడ వలదె?
కను మిరుమిట్లగు పెను కాంతుల వెలార్చు
...........విపరీత పుంజాల విడువ దగదె?
హానికారక రసాయనముల వెదజల్లు
...........మందు గుండును ముందు మాన వలదె?
వృద్ధుల శిశువుల భీతిల జేసెడి
...........నిప్పుతో నాటలు ముప్పు గాదె?

దివ్వటీలను వెలిగించి దిబ్బు మనుచు
నందములు చిందు ప్రమిదల విందు జేయు
నింగి వీడిన తారల భంగి మెరయు
దీప లక్ష్ములు చాలవే దివ్యముగను ?


దివిటీల్ దాలిచి నిల్చినార లరుగో ధృత్యున్నతోత్సాహులై 
బవరం బందు సిపాయి లట్లు వరుసన్ బాలల్ గనన్ వారి రే 
బవళుల్ పూనిక వెల్గు పూల తరులన్ బాతించి పోషింతు మీ 
యవనిన్ శాంతి చివుళ్లు వేయ నన సాయం సంధ్య దీపావళిన్.  

పచ్చని కాంతు లీనుచును భళ్ళున రాలె మతాబు ముత్యముల్ 
చిచ్చులబుడ్లు ఝమ్మనుచుఁ జిందెను బువ్వుల జల్లుజల్లుగాఁ 
జిచ్చును గ్రక్కు జువ్వ లవె చివ్వున నింగికిఁ బ్రాకె నంతలో 
హెచ్చెను డాం ఢ ఢ మ్మనుచు నెన్నొ టపాసుల శబ్ద మెల్లెడన్.