padyam-hrudyam

kavitvam

Sunday, May 12, 2024

శంకర జయంతి 2024

 



నేడు శ్రీ శంకరుల జయంతి.

=====================

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం 

తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్ । 

పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసన్ధీయతా- 

మాత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ ॥


సాంగవేదమ్ములు సద్గురు కృప చేత

...చదువఁబడును గాక సంతతమ్ము

చదువఁబడిన వేద విదిత కర్మమ్ములు

....పాటింపఁబడుఁ గాక వదలఁబడక

వదలఁబడని కర్మ పరమాత్మ పూజను

...నిష్కామమైనదై నిలుపుఁగాక

నిష్కామ కర్మచే నిర్మలమై బుద్ధి

...వాంఛలు విడనాడఁబడును గాక


పాపరాశి దులపఁబడి పారుఁ గాక

భవసుఖమ్ము లనిత్య మన్ భావ మగుత

ఆత్మ తత్త్వమ్మునన్ వాంఛ యగును గాక

స్వగృహమును వీడి వడి వెళ్ళఁబడును గాక.


***

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ ।
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ ॥ 2॥


సజ్జనముల మైత్రి సమకూడఁబడుఁ గాక

...దేవుని యెడ భక్తి దిట్ట మగుత

శాంత్యాది మేలగు సంస్కార గుణములే

...అభ్యసింపఁ బడుచు నలరుఁ గాక

నిత్య నైమిత్తిక నిహితమై యుండియు

...కర్మ సన్న్యాసమ్ము గలుగు గాక

యోగ్యుడౌ విద్వాంసు డొడఁగూ డగుంగాక

...గురుపాదయుగసేవ గూడుఁ గాక


స్వపర భేద రహితుఁడును, సర్వమునను

నొక్కఁడై యుండియును నిండి చ్యుతి నెఱుఁగని

బ్రహ్మ మర్థింపఁబడుఁ గాక ప్రాఁతచదువు

పదము బాగుగాఁ జర్చింపఁబడును గాక.


(జగద్గురువుల ఉపదేశ పంచకము నుండి)

No comments: