padyam-hrudyam

kavitvam

Thursday, March 30, 2023

సంక్షిప్త రామాయణము







సింహరేఖ  


శైలజాత్మజా! ప్రణామా

లేలుకో,  నమస్సు వాణీ!

నాలుక న్వసించవే, దం

డాలు సద్గురూ! మహేశా!


ఆ.వె. 


శ్రీపతి దరి జేరి చేసి నమస్కృతుల్

సురలు మునులు స్వామి చూడ లేదె

పంక్తికంఠుడు చెఱపట్టి లోకాలను

బాధపెట్టుచుండె బాపు కీడు. 2


తే.గీ.


అనుచు మ్రొక్కగా హరి మంద హాసు డగుచు

నవని నరుడనై దిగి వచ్చి యసురు ద్రుంతు

మీ సదంశల మీరును మేదిని నగు

డని యభయ మిచ్చి పంపెను గనికరమున. 3


సీసము  


రాముడై దశరథరాజుకు పుత్రుడై

..కౌసల్య గర్భాన గలిగెను హరి

రాముని తమ్ములై లక్ష్మణ శత్రుఘ్ను

..లతివ సుమిత్రకు నైరి వరుస

మరియొక తమ్ముడై భరతుడు జనియించె

..కైకకు నినవంశ ఘనత వెలయ

బాలురు నల్వురు బాల్యోచితక్రీడ

..లను మురిపించుచు రాజు మదిని


తే.గీ.

పెరుగుచుండి వసిష్ఠ సద్గురువు నొద్ద

సకల శస్త్రాస్త్ర విద్యల చతురు లైరి

పంక్తిరథు డనంతానంద భరితు డగుచు

గడుప గాలము వచ్చెను కౌశికుండు. 4


చంపకమాల  


చనియెను తండ్రియానతిని సంయమికౌశికు వెంట రాము డా

వనమున దాటకిందునిమి పాచి సుబాహుని గాచి యిష్టి ధూ

ళిని బడి యున్న గౌతముని లేమకు రూపము నిచ్చి విద్యలన్

ఘన పరిపాకముం బడసె గాటపు రక్తిని గూడి లక్ష్మణున్.5


ఉత్సాహ  


చనిరి దాశరథులు మిథిల సంయమీంద్రు వెంట నా

జనకరాజు మోద మంది సలిపి పూజ మౌనికిన్

గని రఘూద్వహద్వయమ్ము గారవమ్ము సేసి చూ

పెను గృహమ్ము నందు నున్న పెద్ద శంభు చాపమున్. 6


సుగంధి 


వింటి జూపి పల్కె నిట్లు వేడ్క రాజు చాపముం

గంటిరే మహేశు దివ్య కార్ముకమ్ము దీని నే

బంటు బాణ మెక్కు పెట్టు వాని కిత్తు కూతు మా

కంటి వెల్గు సీత నంచు గట్టి బాస చేసితిన్. 7


మాలిని


అనిన జనకు మాటన్ హర్షుడై మౌనివర్యుం

డిన కుల తిలకున్వీక్షించ స్మేరాననుండై

చని రఘువరు డంతన్ జాపమున్ బైకి లేపన్

ఘనతర రవమాయెన్ గంపమాయెన్ ధరిత్రిన్. 8


ద్విపద 


ఫెళ్ళున దిక్కులు పిక్కటిలంగ

పెల్లగు ధ్వనితో విల్లు విడంగ

కళ్ళను కాంతులు కౌశిక మునికి

ఝల్లని పుల్కలు జానకి మెయికి. 9


కందము


జానకి రాముని తలపై 

జానకి తలపైన రామచంద్రుడు వేడ్కన్

బూనుచ ముత్తెపు సేసల

నానా వర్ణముల మించినా రట పెండ్లిన్.


తోటకము  


కొని నూత్న వధూ వర కూటమినిం

జన బంక్తిరథుండు ప్రచండ రుషన్

గనిపించిన భార్గవు గర్వమడం

చెను రాముడు తండ్రికి సేమ మిడెన్. 11


ఉత్పలమాల  


తోచెడి వార్థకంపు బలు దోరపు జాయలు మేన రాజ్యముం

గాచగ లేను రామునకు గట్టెద బట్టమ టంచు దెల్పగా

నూచిరి మేలుమే లనుచు నుల్లము లుల్లసిలంగ బౌరులున్

దా జిన భార్యకుం దెలిపె దానిని వృద్ధవిభుండు వేడ్కమై.12


మత్తకోకిల 


రామునంపు డరణ్యవాసము రాజు జేయుడు నా సుతున్

గామిత మ్మిది తీర్చు డంచన గైక గూలె హతాశుడై

భూమిపాలుడు రామలక్ష్మణ భూమిజల్ వన మేగగా

నోమె గైకసుతుండు రాజ్యము నుంచి రామునిపాదుకల్.13


మత్తేభము 


తరియించెం జదలేఱు భిల్లపతినిం దన్పెన్ ససౌమిత్రియై

ధరణీజాతను గూడి ఘోరగహనాంతర్వర్తియై తాపసుల్

బరితోషించగ రాక్షసాళి దునుమన్ బద్ధుండయెన్ రాముడు

క్కరియై పంచవటిన్ వసించె సుఖియై కాలంబు సాగన్ వడిన్. 14


స్రగ్విణి 


కామినిన్ జుప్పనాకన్ వికారించగా

రామునిన్ వేలలో రాక్షసుల్ దాకగా

నేమియున్ జంకకే యేసె దా నొక్కడే

భూమిజానాథుడా పోరునన్ శూరుడై. 15


తరళము  


చెనటి రావణు డంపె మాయల జింక నొక్కటి సీత తా

వునకు బట్టగ దాని రాముడు వోయె దూరము దొంగ భి

క్షుని విధమ్మున వచ్చి భీతను క్షోణిజన్ జెరబట్టి పా

రెను జటాయువు పోర రెక్కల వ్రేసి లంకకు ధూర్తుడై. 16

  

మానిని  


శ్రీ వసుధాత్మజ గానక రాముడు చింతను సాగుచు దమ్మునితో

నా వనసీమల జంపి కబంధుని నారసి వృద్ధతపస్విని సు

గ్రీవుని మైత్రిని వాలిని గూలిచి కేసరి పుత్రుని దూతగ నా

రావణుజెంతకు బంపగ మారుతి లంకనుగాలిచె సీత గనెన్. 17


అంబురుహము  


చేరె విభీషణు డాశ్రయ మిమ్మని శ్రీ రఘూత్తము చెంతకున్

వారధి గట్టిరి సంద్రము దాటిరి వానరుల్ పెనుమూకలై

పోరిరి రాక్షస కోటుల నేసిరి పోటుకాండ్లయి లంకలో

బోరున రావణు బంధువు లందరు బోయి రంతకు పాలికిన్.

18


మేఘవిస్ఫూర్జితము


అమాంతం బగ్నిజ్వాల బడు శలభా లట్లు దైత్యాళి వ్రాలన్

సమీపాన న్రామాస్త్రముల భయద జ్వాలలం భస్మమయ్యెన్

భ్రమల్మాసెన్ బ్రహ్మాస్త్రమున బడె నా రావణుం డాజిలో లో

కముల్సర్వంబున్ హర్షమున  బొగడంగాను శ్రీ రామచంద్రున్. 19


మంగళమహాశ్రీ  


జానకి పునీత ఘనసాధ్వి యన బావకుడు 

....సంతసమునం ధరణిజాతన్

బాణిగొని పుష్పకము పై జని యయోధ్యకు 

....శుభం బన సురర్షినరసంఘాల్

బూనికను ధర్మమును భూమి నలు దిక్కులను 

....బూన్చి పరిపాలనము జేసెన్

దాను హరి రాముడయి ధర్మ విభుడై నిలిచె 

....ధాత్రి పలు వేల ఋతువృత్తుల్. 20


మధ్యాక్కర   


చదువ రామకథను వాగృషభుడౌను విప్రుడు రాజ

పదవి నలంకరించు ధర బఠియింప దీని క్షత్రియుడు

పొదలును వణిజున కిలను బొల్పుగ బణ్యఫలత్వ

ము దొఱయు సుఖము శూద్రునకు భూమిని సత్యవాక్కు లివి. 21

No comments: