పరమేశ వృత్తము
( పరమేశునకు పంచోపచారములు )
***
లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి నమః
'అదితి' ప్రకృతి మహద్యశా! భయనాశా!
హృదు'లం' దెలమి వసించు హే స్మర నాశా!
పదము ల్విడువను ఛిన్నభానుజపాశా!
ఇదె 'గంధము'ను గ్రహింపుమీ పరమేశా! 1
హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి నమః
'గగనం'పు గుణము లింపుగా గల యీశా!
అగజాత హృదయచోర! 'హం'స! మహేశా!
సగ మేన బొదువు కొంటె జాయను మోద
మ్ముగ నీ కిడుదును 'పుష్పము' ల్పరమేశా! 2
యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి నమః
'అనిలం'పు గుణ విరాజితా! ఫణిభూషా!
ఘన చారుతర మనోజ్ఞకాంతి సుదేహా!
జనతార్తిహర! జ'యం'త! శంకర! ధూప
మ్ము'ను మూర్కొను మివె దండము ల్పరమేశా! 3
రం వహ్ని తత్వాత్మనే దీపం పరికల్పయామి నమః
'అనలం'పు ప్రకృతి శోభితా! నిటలాక్షా!
జన'రం'జన! ప్రమధాది సంవృత! రుద్రా!
గుణిధారి! హర! త్రినేత్ర! గోఘృత'దీప
మ్ము'ను జూడుము ప్రణిపాతము ల్పరమేశా ! 4
వం అమృత తత్వాత్మనే అమృతనైవేద్యం పరికల్పయామి నమః
'అమృతా'త్మ! వరసుధాకరాశ్రిత శీర్షా!
హిమ'వం'త సదన గౌరి హృన్నిలయా! నీ
వమృతమ్ముగ మది నెంచుమా ఫల 'నైవే
ద్య'మిదే దయ గొనరావయా! పరమేశా! 5
****
(పరమేశ వృత్తము .. స న జ భ గగ 10 యతి శక్వరి ఛందము 3452 వృత్తము
I I U I I I I U I U I I U U )
No comments:
Post a Comment