padyam-hrudyam

kavitvam

Saturday, September 23, 2023

రాధామాధవం




రాధామాధవం :

శ్రీ డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ వారి సౌజన్యంతో...

********

కృష్ణాష్టమి - బృందావనం

' రాధా! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో. ఏదైనా ఇస్తాను.' 
'మాధవా! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు, ఔనా?' 
'అవును రాధా!' 
'నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా?' 

చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది. 
'నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా!'

***

రాధాష్టమి - అదే బృందావనం 

ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది 
'కృష్ణా! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు . నువ్వు నా అద్దానివా? నన్ను నేను చూసుకుం టున్నానా?'.. సరస భాషిణి, సహజ చమత్కారి కదా రాధ. 'ఈ సంతోష సమయంలో, నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా!'

ఆశ్చర్యచ కితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని, వొకింత ఆలోచించి, ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు. 
'ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా! అన్నట్లు రాధా! నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా!
'గలగలా నవ్వింది రాధ. 
'నీకన్నా విలువైనది నేనే గోపాలా!' 
హతాశుడయ్యాడు కృష్ణుడు! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 'ఏమంటున్నావు రాధా! నువ్వు నాకంటే విలువైనదానివా? ఎలా?' 
'భక్తుడికి, భగవంతుడు దాసుడు కాదా, వాసుదేవా!' 'అవును' 
'నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా' 
'నిజం' 
'నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా!' 'అనుమానమెందుకు రాధా!' 
'నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ' 
'ఒప్పుకున్నాను రాణీ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు?'
'ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా'

కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి! కృష్ణుణ్ణి పూజించే వారెందరో, ఆరాధించే వారింకెందరో. కానీ, ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ? రాధకు కృష్ణుడి అవసరం కంటె, కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో, లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది. కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది. వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. 

'ఏ.. ఏమిటిది!.. మా.. మాధవా!'
రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది. 
'బానిస, యజమానికి నమస్కరించాలి కదా!' 
కృష్ణుని వినయసౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది. రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి, సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.

ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి, తీర్థంగా స్వీకరించి యమున తరించింది.
పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. 
జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. 
ఆ అమల ప్రేమికులను, ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.

యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. 
అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. 
అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం 'రాధామాధవం'.

No comments: