క్షిపణిపితామహా! క్షితిని చివ్వున వీడి నభమ్ము నేగితే
క్షిపణిని మించు వేగమున చివ్వున నశ్రులు చింద? నేదయా
క్షిపణి భయంకరా! రిపుల చీల్చెడి ప్రేల్చెడి ప్రేరకమ్ము మా
క్షిపణులకింక? నౌను గద శ్రేయము గూర్చెడు నీ తలంపులే.
శాస్త్రజ్ఞు డందుమా చక్కని పాఠాల
.........గరపెడు పూజ్యుడౌ గురువితండు!
గురువందుమా సదా యెరుకకై తపియించు
.........నాదర్శవంత విద్యార్థి యితడు!
విద్యార్థి యందుమా విశ్వగుర్వన దగు
........భరతావని ప్రథమ పౌరు డితడు!
పౌరుడే యందుమా ప్రగతికి బలమిచ్చు
........నావిష్కరణలకు నాద్య మితడు !
కవి, విరామమెరుమంగని కార్మికుండు,
దేశభక్తికి నిలువెత్తు దివ్య రూపు,
బోధనాతృష్ణ బాయని బుద్ధిజీవి,
పరువు పదవిఁ, కలామన నురు యశస్వి.
No comments:
Post a Comment