వచ్చి కరోన శార్వరిని వంతలు చింతలు మిక్కుటమ్ముగా
పచ్చడి చేసి పెట్టినది పచ్చగ సాగెడి జీవనమ్ములన్
వచ్చితి వీవు పండు గను వాస్తవమున్ గణియింపఁ జాల కా
రచ్చను మున్గి నిన్ను ప్లవ రమ్మని పిల్వగ లేదు సత్యమే.
శార్వరి సాగిపోయె కడు జాలిగ నిండ్లను బంది లైతి మే
పర్వము నేరకే గుడులు బళ్లును నంగడు లన్ని మూయగా
సర్వము ఛిద్రమయ్యె నిక చాలును పోయిన దంచు నెంచి నీ
పర్వము హాయిగా జరుపు భాగ్యముకై తపియించు చుండగా..
చిక్కెను రేలు నెమ్మదిగ జిక్కఁగ బూయుచు నుండె వేములున్
మెక్కి చివుళ్ళ మావి పయి మేళము సేయఁగ జొచ్చె కోయిలల్
దిక్కులు గ్రొత్త శోభలను దీప్తములై కనుపట్టు చుండె నీ
చక్కని వేళ వచ్చును వసంతుఁ డటంచును దోచె నెమ్మదిన్.
తెల్లని కాంతు లాయె నలు దిక్కుల సందడి సేసె తెమ్మెరల్
చల్లిన పుచ్చపూల చిరు జల్లుల వోలె రహించె వెన్నెలల్
మల్లెల తావులన్ జెలగె మాపులు తీయని బాధ లూరగా
జిల్లని ప్రేమికాళి యువ చిత్తము లందు వసంతు రాకతో.
వచ్చుచు నుంటి వీ వనుచు వత్సలతన్ ఘనమైన స్వాగత
మ్మిచ్చెద మన్న లో నెడద నేవొ దిగుళ్ళు భయమ్ము రేపెడిన్
రెచ్చుచు నుండె నీ కరొన రెండవ సారి మరింత మొండియై
త్రచ్చుచు నుండె ధారుణిని ధైర్యము చాలక యుండె నెమ్మదిన్.
కవులకు గాయకాళికిని కమ్మని భావములే రుచించు నీ
యవనికి సేమ మౌటె తమ కౌ ముద మెన్నడు చూడ నో ప్లవా
ప్రవిమల మైన మంగళము లన్ బ్రకటించుమ ధాత్రి నెల్లెడన్
వివరముగా సుఖింప కడు వేడ్కను ప్రాణులు సర్వము న్నతుల్.
ప్లవ నామ వత్సర మ్మన
శివముల కాకరము గాత చెలగుత హితయై
భువి నున్న ప్రాణికోటికి
బవియై క్రిమి శృంగములను బఱిగొనుత వెసన్.
No comments:
Post a Comment